హైదరాబాద్: ఒకవైపు హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతుంటే పోలీసులు ఇన్నోవా వాహనాలను చెట్లకింద పెట్టుకుని సెల్ఫోన్లలో మాట్లాడుకుంటూ, పేకాటలు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ ఇవాళ తెలంగాణ శాసనమండలి సమావేశంలో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కౌన్సిల్లో కొద్దిసేపు రభస చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ వ్యాఖ్యలపై నీటిపారుదల శాఖమంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. పేకాట క్లబ్బులు నడిపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదని, స్వయంగా కాంగ్రెస్ నాయకులకుకూడా పేకాట క్లబ్బులు ఉండేవని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేకాట క్లబ్బులను మూసేయించిన ఘనత కేసీఆర్‌దని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు ప్రభాకర్ తన వ్యాఖ్యల ద్వారా పోలీస్ వ్యవస్థను కించపరుస్తున్నారని ఆరోపించారు. దీనికిగానూ ఆయన సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ దీనిపై స్పందిస్తూ, పోలీసులు పేకాటలపై తాను చెప్పింది తన మాటలు కాదని, ఒక పోలీస్ అధికారి అన్నట్లుగా పత్రికలలో వచ్చిన వ్యాఖ్యలని చెప్పారు. మరోవైపు హరీష్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మరో ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మండిపడ్డారు. హరీష్‌కు సభ నిబంధనలు తెలియవని, సభలో లేనివారిపై వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఉద్యమం సమయంలో ఎంత వసూళ్ళు చేసుకున్నారో తామూ బయటపెడతామని చెప్పారు.
వాస్తవానికి శాంతిభద్రతలకు సంబంధించిన ఈ విషయంపై రాష్ట్ర హోంమంత్రి నాయని నర్సింహారెడ్డి స్పందించాల్సి ఉండగా, హరీష్ లేచి స్పందించటం ఇక్కడ గమనార్హం. అటు శాసనసభలోగానీ, శాసనమండలిలోగానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు విమర్శలు చేసిన ప్రతిసారీ తనశాఖకు సంబంధంలేకున్నా హరీష్ రావు లేవటం, ఘాటుగా ప్రతిస్పందించటం జరుగుతోంది. ఈయనగారి అత్యుత్సాహం ఏమిటో అర్థంకావటంలేదు. హరీష్ మాట్లాడిన తర్వాత లేచిన నాయని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగోలేదని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఒకే రోజు హైదరాబాద్ నగరంలో 11 చోట్ల చైన్ స్నాచింగ్ సంఘటనలు జరిగితే శాంతి భద్రతల పరిస్థితి బాగున్నట్లు ఎలా అవుతుందో అర్థంకావటంలేదు.