హైదరాబాద్: మెగా పవర్‌స్టార్ రాంచరణ్ తాజా చిత్రం ‘బ్రూస్లీ’ ఆడియో రేపు విడుదల కాబోతుండగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక వివాదానికి తెర తీశారు. ‘బ్రూస్లీ’ పేరుతో తాను ఒక చిత్రం విడుదల చేయబోతున్నట్లు ఇవాళ ఉన్నట్లుండి ప్రకటించటమే కాకుండా, ట్రైలర్ కూడా విడుదల చేసేశారు. తాను బ్రూస్ లీకి అతి పెద్ద అభిమానినని, తన ఈ ‘బ్రూస్ లీ’ చిత్రం ఒక అభిమాని కథ అని ఇవాళ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఎంటర్ ది డ్రాగన్’ చిత్రాన్ని 17 సార్లు, ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ 23 సార్లు చూశానని తెలిపారు. బ్రూస్ లీ ఎంతోమందికి ప్రేరణగా నిలవటానికి తాను అర్థం చేసుకున్న కారణాలతో ఒక సినిమా తీయాలనే ధ్యేయంతో ఈ కథను తయారుచేసుకున్నానని పేర్కొన్నారు.
ఈ ట్రైలర్లో – ఇది భారతదేశంలో తొలి మార్షల్ ఆర్ట్స్ చిత్రమని వర్మ పేర్కొన్నారు. అయితే ఈ చిత్రం ఏ భాషలో రూపొందుతోంది, నటీనటులు ఎవరు అనేదిమాత్రం తెలపలేదు. ఆ ట్రైలర్లో ఉన్న నటి కొత్త అమ్మాయిలాగా ఉంది. ఆ ట్రైలర్లో అమ్మాయి నటనకానీ, సాంకేతిక విలువలుగానీ బాగున్నాయి. మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు తీశారో, షూటింగ్ ఎంతవరకు అయిందో అనేది వర్మ వెల్లడించటంలేదు. మరోవైపు రాంచరణ్ చిత్రం ‘బ్రూస్ లీ’ని దర్శకుడు శ్రీను వైట్ల ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ఈ చిత్రంలో ఒక అతిథి పాత్రలో నటిస్తున్నారుకూడా. ఆ భారీ చిత్రం విడుదలకు సన్నాహాలు జరుగుతుండగా వర్మ ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ చేయటం ఒకరకంగా సంచలనమే. వాస్తవానికి వర్మకుకూడా కావలసింది అదే.
[youtube http://www.youtube.com/watch?v=XM8Mx-dYln0&w=640&h=360]