ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గత నెల 26 నుండి గుంటూరులో చేయదలచిన నిరవధిక నిరాహార దీక్షకి ఆఖరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో దానిని రద్దు చేసుకొని మళ్ళీ ఈనెల 7వ తేదీ నుండి గుంటూరులోనే నల్లపాడు రోడ్డు సమీపంలో హనుమాన్ నగర్ వద్ద దీక్షకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. క్రిందటిసారి దీక్షకు ముందు భూమిపూజ చేసి, రాష్ట్రంలో విద్యార్ధులను కలిసి వారి మద్దతు కోరిన జగన్ ఈసారి గవర్నర్ నరసింహన్ న్ని కలవడం విశేషం.
ఆయన గవర్నర్ ని కలిసి ఏమి మాట్లాడారో ఇంకా తెలియదు కానీ 7వ తేదీ నుండి గుంటూరులో తను చేయబోయే దీక్షకి ఈసారి పోలీసులు ఆటంకం కల్పించకుండా చూడమని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసుల నుండి ముందస్తు అనుమతి తీసుకొంటే సరిపోయేదానికి జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని గవర్నర్ ని కలవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశః తన దీక్ష గురించి ముందే ఆయన దృష్టికి తీసుకువస్తే ఈసారి కూడా పోలీసులు అభ్యంతరం చెప్పినట్లయితే ఆయన కలుగజేసుకొంటారని ఆశిస్తున్నారేమో? కానీ ఇంతకంటే చాలా ముఖ్యమయిన విషయాలలోనే కలుగజేసుకొని గవర్నర్ ఈ విషయంలో కలుగజేసుకొంటారని ఆశించలేము.
వైకాపా నేతలు ప్రత్యేక హోదా అంశం గురించి తక్కువగా, జగన్ దీక్ష గురించి ఎక్కువగా మాట్లాడుతూ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నట్లుంది. కానీ ఈరోజుల్లో ఏ రాజకీయ నాయకుడు నిరాహార దీక్ష చేసినా నాలుగయిదురోజులు కాగానే పోలీసులు రంగప్రవేశం చేసి దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించడం, అక్కడ సిలిన్ ఎక్కించుకోవడానికి సదరు నేత మొరాయించడం, అప్పుడు వైద్యులు అతనికి బలవంతంగా సిలైన్ ఎక్కించి దీక్షను భగ్నం చేయడం అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరిగిపోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక జగన్ దీక్ష కూడా అదేవిధంగా ముగియవచ్చును. కానీ పోలీసులు ఆయన దీక్షకు అనుమతి నిరాకరించి దానికి మరింత ఉచిత ప్రచారం కల్పించారు. అంతే!