హైదరాబాద్: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న చిరంజీవి 150వ చిత్రానికి కథ ఎట్టకేలకు ఖరారయింది. తమిళంలో హీరో విజయ్ హీరోగా గత ఏడాది విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రం ‘కత్తి’ని చిరంజీవి ఎంచుకున్నారు. తమిళంలో ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహించారు. తెలుగులో వినాయక్‌ను దర్శకుడిగా ఎంచుకున్నారు. అయితే స్క్రీన్‌ప్లే మాత్రం మురుగదాస్ అందిస్తారు. గతంలో మురుగదాస్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన రమణ చిత్రాన్ని తెలుగులో వినాయక్ దర్శకత్వంలో ‘ఠాగూర్’గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అవటం విశేషం.
ఈ చిత్రాన్ని చిరుతనయుడు రాంచరణే నిర్మిస్తున్నారు. రేపు బ్రూస్‌లీ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో ఈ వార్తను అధికారికంగా ప్రకటించబోతున్నారు. వచ్చేనెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. గత ఏడాది అక్టోబర్ 22న తమిళంలో విడుదలైన ‘కత్తి’ చిత్రం రైతుల ఆత్మహత్యల కథాంశంతో రూపొందింది. విజయ్ రెండు పాత్రలలో నటించారు. సమంత హీరోయిన్‌గా నటించింది.
మరోవైపు ఈ చిత్రానికి వినాయక్ దర్శకత్వం అంటే చిరంజీవి దర్శకత్వం చేసినట్లే అనే వాదనలు వినబడుతున్నాయి. ఇంతకుముందు తన సినిమాలలో, ఇప్పుడు చరణ్ సినిమాలు చాలావాటిలో చిరంజీవి వివరీతంగా జోక్యం చేసుకుంటారన్నది టాలీవుడ్‌లో అందరికీ తెలిసిన విషయమే. అలా జోక్యం చేసుకోవటంవలన చాలా సినిమాలు ఫ్లాప్‌కూడా అయ్యాయి. మురుగదాస్ తెలుగులో దర్శకత్వం వహించిన ‘స్టాలిన్’ దీనికి ఒక ఉదాహరణగా చెబుతారు.