వారం రోజుల క్రితం విశాఖలో భారీ వర్షం కురిసినప్పుడు ఆరేళ్ళ చిన్నారి అదితి ప్రమాదవశాత్తు మురికి కాలువలో పడిపోయింది. అప్పటి నుండి ఆ చిన్నారి కోసం మునిసిపల్, నేవీ సిబ్బంది వెతకని ప్రదేశం లేదు. ఆమె పడిపోయిన చోట నుండి సముద్రం వరకు ఉన్న కాలువలన్నిటినీ జల్లెడపట్టారు. కానీ ఆమె ఆచూకి లభించకపోవడంతో నిన్న సాయంత్రం నుండి గాలింపు చర్యలను నిలిపివేశారు. కానీ గురువారం మధ్యాహ్నం విజయనగరం జిల్లాలో భోగాపురం మండలం దిబ్బపాలెం వద్ద గల సముద్ర తీరానికి ఆ చిన్నారి శవం కొట్టుకు వచ్చింది. ఆ విషయం తెలుసుకొన్న అదితి తండ్రి సత్య శ్రీనివాసరావును పోలీసులు అక్కడికి తీసుకు వెళ్ళారు. ఆ చిన్నారి ఒంటిపై ఉన్న దుస్తులను బట్టి ఆమె తన కుమార్తెనని శ్రీనివాసరావు గుర్తించారు. ఎంతో గారాభంగా పెంచుకొన్న తన చిన్నారి అధితిని ఆ స్థితిలో చూసి బోరున ఆయన విలపిస్తుంటే చూసేవారి కళ్ళు కూడా బాధతో చెమర్చాయి. పోలీసులు ఆమె శవాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కోసం విశాఖకు తరలించారు. విశాఖపట్టణంలో కాలువలో పడిపోయిన ఆ చిన్నారి చివరికి విజయనగరం సముద్రం ఒడ్డున శవమై తేలడంతో ఆమె తల్లి తండ్రులే కాదు ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఆ చిన్నారి ఆత్మకు శాంతి అందరూ కలగాలని ప్రార్దిస్తున్నారు.