నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో మామూలు రాళ్లు, ఇటుకులతోపాటుగా డిజిటల్ బ్రిక్స్ కూడా చేరబోతున్నాయి. ఇది వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం రాజధాని నిర్మాణంలో డిజిటల్ ఇటుకలను కూడా వాడేందుకే రెడీ అవుతున్నారు. ప్రధానమంత్రి మోదీ ఒక పక్క డిజిటల్ ఇండియా అంటూ ఉద్యమిస్తుంటే, బాబుగారు తనదైన శైలిలో డిజిటల్ బ్రిక్స్ ఉద్యమంతో ముందుకుపోవాలనుకుంటున్నారు.
హైటెక్ ముఖ్యమంత్రిగా గతంలోనే పేరుబడ్డ చంద్రబాబు నాయుడుగారి బుర్రలో ఇప్పుడు మరో హైటెక్ ఆలోచన తళుక్కుమంది. డిజిటల్ ఇటుకుల ద్వారా నూతన రాజధాని నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేయడానికి రంగం సిద్దంచేశారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా రాజధాని నిర్మించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొత్త క్యాపిటల్ అమరావతి నగర నిర్మాణంలో ప్రజలందరినీ భాగస్వాములుగా చేస్తామని ఇంతకుముందే ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు ఈ సంకల్పాన్ని సాకారంచేసుకునే దిశగా మరో అడుగుముందుకేశారు. `ప్రజల రాజధాని అమరావతి’ అన్నపేరు సార్థకమయ్యేలా అందరి భాగస్వామ్యం ఉండేందుకు డిజిటల్ బ్రిక్స్ పద్ధతిని తీసుకువస్తున్నారు.
అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకకాదు. కాకపోతే అందర్నీ కలుపుకుపోవాలన్న ఆలోచనతోనే చంద్రబాబు ఈ డిజిటల్ ఇటుకుల ద్వారా ప్రజలద్వారా విరాళాలు వసూలుచేసి వారిని కూడా మెగా ప్రాజెక్ట్ లో భాగస్వాములను చేయాలనుకుంటున్నారు. డిజిటల్ బ్రిక్స్ అందించే విధానం పూర్తిగా కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక డిజిటల్ ఇటుక ఇవ్వాలనుకుంటే వంద రూపాయలు ఇవ్వాల్సిఉంటుందని అనుకుందాం. ప్రభుత్వ ఖాతాలోకి ఆన్ లైన్ ద్వారా వంద రూపాయలు జమచేయగానే మీరు ఒక ఇటుక (డిజిటల్ బ్రిక్) ఇచ్చినట్లు ఇమేజ్ కానీ, లేదా మెసేజ్ గానీ మీకు వస్తుంది. మన శక్తికి తగ్గట్టుగా ఎన్ని డిజిటల్ ఇటుకలు ఇవ్వాలనుకుంటే అన్ని అందించే సదుపాయం ఉంటుంది. డిజిటల్ ఇటుకలు ఇచ్చిన వారి పేర్లు ప్రభుత్వం దగ్గరకు చేరుతాయి. జాబితాను వెబ్ సైట్ లో వెల్లడిచేస్తారు. అంటే డిజిటల్ బ్రిక్స్ కోసం డబ్బుకడితేచాలు అమరావతి నగర నిర్మాణంలో మీరూ యజమానిగా మారిపోతారన్నమాట. సరిగా ఇదే చంద్రబాబు ఆలోచన. దీన్ని కార్యరూపం దాల్చడానికి రంగం ఇప్పుడు సిద్ధమైంది.
కంప్యూటర్ గేమ్స్ తరహాలో ఈ డిజిటల్ బ్రిక్స్ ఇచ్చే విధానం తీసుకువస్తే అందరికీ ఉత్సాహం ఉంటుంది. ఇలా డిజిటల్ బ్రిక్స్ ఇచ్చేవారికి రకరకాల ఈ- బ్యాడ్జ్ లు ఇవ్వడం ఉత్సాహాన్ని రెట్టింపుచేస్తుంది. అంటే, పది డిజిటల్ బ్రిక్స్ ఇస్తే మనకు ప్రభుత్వం నుంచి పింక్ బ్యాడ్జ్ విత్ బ్రిక్ ఇమేజ్ వస్తుందనుకుందాం. అలాగే వంద డిజిటల్ బ్రిక్స్ అందిస్తే ఎల్లో బ్యాడ్జ్ విత్ బ్రిక్ ఇమేజ్ వస్తుందని అనుకోవచ్చు. ఇదంతా డిజిటల్ బ్రిక్స్ అందించేవారిలో నూతనోత్సాహం పెంపొందించినట్లు అవుతుంది. వారు ఈ-బ్యాడ్జ్ లను సోషల్ మీడియా (పేస్ బుక్ , వాట్సప్ వంటివి) లో పోస్ట్ చేసుకుంటూ దీన్నో ఉద్యమంగా తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. బహుశా ఈతరహా ఆలోచనతోనే చంద్రబాబు డిజిటల్ బ్రిక్స్ పద్ధతిని తీసుకువచ్చారని అనుకోవచ్చు. మరి కొద్దిరోజుల్లోనే ఈ డిజిటల్ బ్రిక్స్ విధానంపై పూర్తి అవగాహన రావచ్చు.
అక్టోబర్ 22వ తేదీ విజయదశమిరోజున నూతన రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఓ మహోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీసహా పలువురు దేశ, విదేశీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
– కణ్వస