పరిశుభ్రత సాధించడానికి, ఆత్మగౌరవానికి భంగం కలిగేలా టాయిలెట్ కోసం ఆరు బయటకు వెళ్లే దుస్థితిని నివారించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన పథకం స్వచ్ఛ భారత్. ఇది అనుకున్నంత సఫలం కాలేదనే అభిప్రాయం ఒక వైపు వినిపిస్తుండగా, తొలి అడుగు బాగానే పడిందనడానికి కొన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఈ గాంధీ జయంతితో ఏడాది పూర్తయింది. 21వ శతాబ్దంలోనూ చెంబు పట్టుకుని బహిరంగ ప్రదేశానికి వెళ్లడమా? ఎంత అవమానకరం. మహిళలకు ఎంత నరకప్రాయం. అందుకే, స్వచ్ఛ భారత్ సఫలం కావడం చాలా ముఖ్యమని మోడీ అభిలాష. గత ఏడాదిలో దేశ వ్యాప్తంగా సుమారు 80 లక్షల టాయిలెట్ల నిర్మాణం జరిగింది. అయితే వాటిని కచ్చితంగా ఉపయోగించేలా చేయాల్సి ఉంది.
స్వచ్ఛ భారత్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛ తెలంగాణ చేపట్టింది. స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమానికి 200 కోట్లు మంజూరు చేసింది. ఒక్క గ్రేటర్ హైదరాబాదులోనే 6 వేల మంది చేంజ్ ఏజెంట్ల ద్వారా ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలు స్వచ్ఛత సాధన దిశలో స్ఫూర్తిదాయకమైన పురోగతిని సాధించాయి. బహిరంగ మలవిసర్జన లేని తొలి నియోజకవర్గంగా సిద్దిపేట కీర్తి గడించింది. చెత్త కుండీలు లేకుండా, పక్కాగా ఇంటింటా చెత్త సేకరిస్తూ పరిశుభ్రమైన పట్టణంగా అవతరించింది. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ స్వస్థలం కావడం విశేషం. కేసీఆర్ తనయుడు కె తారక రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోనూ స్వచ్ఛ భారత్ విజయగాథ వినిపిస్తోంది. స్వచ్చ సిరిసిల్ల పేరుతో 12 వేల టాయిలెట్ల నిర్మాణానికి ఆయన ఇటీవలే సంకల్పించారు. గాంధీ జయంతి నాటికి ఈ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించారు. వీటిని రోజూవారీగా సమీక్షించారు. టాయిలెట్ల నిర్మాణమే కాదు, శానిటేషన్ పనులు, శుభ్రమైన మంచినీటి సరఫరా పైనా దృష్టి పెట్టారు.
తండ్రీ తనయుల కృషి వల్ల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఇతర నియోజకవర్గాల్లోనూ వీలైనంత వరకు టాయిలెట్ల నిర్మాణంపై శ్రద్ధ వహిస్తున్నారు. అయితే రోడ్లపై చెత్తను పడేయడం అనేది ఇంకా కనిపిస్తూనే ఉంది. మనం చెత్తను పడేస్తే ఎవరో వచ్చి తీసుకుపోతారు అనే భావన జనంలో ఉండిపోయింది. దీన్ని తొలగిస్తే గానీ తెలంగాణ రోడ్డు నిజంగా పరిశుభ్రంగా మారే అవకాశం లేదు.