భారత ప్రధాని నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఉదయమే గాంధీజీ కి నివాళులు అర్పించారు. ఈ ఇద్దరితో సహా వేర్వేరు స్ధాయిల్లో విధాననిర్ణయాలు తీసుకోగల అధికారంలో వున్న వేలవేల మంది నాయకులెవరూ వర్తమాన సమాజానికి గాంధేయ ప్రత్యామ్నాయాల గురించి ప్రస్తావించడమే లేదు. అసలు ఆ ప్రత్యామ్నాయాలు ఇపుడు పనికివస్తాయా పనికిరావా అన్న చర్చకు కూడా ఎవరూ దారితీయడమేలేదు. గ్లోబలైజేషన్ ప్రక్రియలో హేతుబద్ధత గురించి ప్రస్తావన వచ్చినపుడు భారీ పారిశ్రామికీకరణ మీద గాంధీజీ అభిప్రాయాలు గుర్తుకిరాక తప్పదు. భారీ పరిశ్రమలు భారీ పెట్టుబడులపై ఏ నాయకుడైనా సరేపనిచేసేవారిపై పెట్టుబడిదారుల పెత్తందారీతనాన్ని విమర్శిస్తారు. అందులోవున్న ఉత్పాదక సాధనాలను విమర్శించజాలరు. ఒక్క గాంధీజీ మాత్రమే భారీ పరిశ్రమలను అన్ని విధాలా వ్యతిరేకించారు. సమాజం అంతటికీ చెందవలసిన సహజవనరుల ప్రయోజనాలను భారీయంత్రాలు కొద్దిమంది పెట్టుబడిదారులముందే పోగులు పెడతాయని, ఇది మనిషికి, అతని ఉత్పత్తులకు సాధనాలైన పనిముట్లకు మధ్యగల అనురాగాన్ని ధ్వంసం చేస్తుందని గాంధీజీ నిస్సంకోచంగా చెప్పారు.
ఉపాధికల్పించలేని సమాజాలలో, అతికొద్దిమంది వనరులను స్వాధీనం చేసుకుని అనుభవిస్తుండగా పేద,ధనిక తారతమ్యాలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో గాంధీజీ ఆలోచనకు ఎంతైనా ప్రాధాన్యత వుంది. వందలఏళ్ళ పరాయీకరణవల్ల సమాజాలు ఆలోచించడం మరచిపోయిన పుడు గాంధీజీ ఆలోచించడం మొదలుపెట్టారనిపిస్తోంది. అహింస, సహనాలను ఆయన పరిశీలననుంచీ, అనుభవాలనుంచీ నేర్చకున్నారు. ఆయన దక్షిణాఫ్రికాలోని ఫీనిక్స్ నివాసముంటున్నపుడు ఒకసారి తాను చెప్పిన మాట వినలేదని కస్తూర్బా ను కొట్టి, బయటికి నెట్టేశారట. ఆమె తెల్లవార్లూ చలిలో నిలబడి వుండటాన్ని తలుపుతీశాక గమనించారు. ఆమె సహనమే ఒక శక్తి అనీ, బాధను భరించడం కూడా ఒక ఆయుధమేననీ తెలుసుకున్నారు. సత్యాగ్రహభావనకు ఈ సంఘటనే గాంధీజీకి ప్రేరణ అయ్యింది.
అహింసా మార్గంలో స్వాతంత్రం సాధించిన భారతదేశంలో గాంధీజీ విస్తృతమైన ప్రజామోదం పొందారు. అదేపద్ధతిలో ఆఫ్రికాను బ్రిటీష్ వారినుంచి విముక్తిచేసిన నెల్సన్ మండేలా. ఇక్కడ చిన్నతేడా కూడా వుంది. ఇండియా నుంచి బ్రిటీష్ వారు వెళ్ళిపోయారు. ఆఫ్రికాలో వారు అధికారం నుంచి దిగిపోయినా అక్కడి సమాజంలో భాగమైపోయారు. ప్రజలకు సాధికారికత కల్పించడంలో భారత్ కంటే ఆఫ్రికా ముందు వుంది. అక్కడ అధికారం మార్పిడి సామాజిక న్యాయం ద్వారా జరగడమే ఇందుకు కారణం కావచ్చు!
భారతదేశం వంటి బహుమత, కుల,వర్గ, సాంస్కృతిక సమాజాన్ని ఏకతాటి మీద నడిపించే నాయకుల విఫలప్రయత్నాలవల్ల గాంధేయ సిద్ధాంతాలు కొంత యధాతధవాదంగా, కొంత సామరస్యవాదంగా, కొంత పరివర్తనవాదంగా మారిపోయినట్టు అర్ధమౌతోంది.
ఏమైనాగానీ, ఐన్ స్టీన్ అన్నట్టు ”ఈవ్యక్తి రక్తమాంసాలతో ఈనేలపై నడయాడాడా అని భవిష్యత్తులో ప్రజలు ఆశ్చర్యపోతారు” అన్నంత వున్నతమైనది…గాంధీజీ వ్యక్తిత్వం.