భారత్-పాక్ దేశాల మధ్య ఐక్యరాజ్యసమితి వేదికగా మాటల యుద్ధం జరుగుతుంటే, కాశ్మీర్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లలో కూడా రెండు విభిన్నమయిన పోరాటాలు జరుగుతున్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా శ్రీనగర్ లో వేర్పాటువాదులు భారత వ్యతిరేక ప్రసంగాలు చేస్తూ, పాకిస్తాన్, ఐసిస్ జెండాలను బహిరంగంగా ప్రదర్శిస్తూ నిత్యం భారత ప్రభుత్వానికి సవాలు విసిరుతున్నారు. జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ని అందుకు నిందించక తప్పదు. అతను అధికారం చేపట్టగానే రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగనిచ్చినందుకు పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాక్ ఉగ్రవాదులకి, రాష్ట్రంలో వేర్పాటువాదులకి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తరువాత కరడుగట్టిన వేర్పాటువాది మసరాత్ ఆలమ్ ని కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా జైలు నుండి విడుదల చేసారు. తరువాత మళ్ళీ అతనిని అరెస్ట్ చేసారు. కానీ ముఖ్యమంత్రి సయీద్ తన మాటల ద్వారా, చేతల ద్వారా ప్రజలకు, వేర్పాటువాదులకు, ఉగ్రవాదులకు, పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా చాలా తప్పుడు సందేశాలు పంపించినట్లయింది. ముఖ్యమంత్రే స్వయంగా వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లుంది. అందువల్లే అప్పటి నుండి కాశ్మీర్ లో వేర్పాటువాదులు ప్రేట్రేగిపోతున్నారు…ఉగ్రవాద మూకలు సరిహద్దులు దాటి భారత్ లోకి ప్రవేశించేందుకు సాహసిస్తున్నారు.
ముఫ్తీ మహమ్మద్ సయీద్ అటువంటి తప్పుడు సందేశాలు ఇస్తుంటే, అతని ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతున్న బీజేపీ తక్షణమే అతనిని గద్దె దించి గట్టిగా బుద్ధి చెప్పకపోగా అధికారం కోసం నేటికీ అతనితో అంటకాగుతూ జరుగుతున్న విపరీత పరిణామాలని ప్రేక్షకుడిలా మౌనంగా చూస్తోంది. అటువంటప్పుడు అంతర్జాతీయ వేదికల మీద భారత్ పాకిస్తాన్ కి ఎంత ధీటుగా, ఘాటుగా జవాబులు చెప్పినా ఏమి ప్రయోజనం? అంతర్జాతీయ వేదికలపై ఎవరు ఎవరిపై పైచేయి సాధించుకొన్నారో గొప్పలు చెప్పుకోవడానికి, అవి చూపించుకొని స్వదేశంలో భుజాలు చరుచుకోవాడానికి మాత్రమే పనికి వస్తాయి. అమెరికాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నిజంగానే విజయవంతం అయ్యి ఉండవచ్చును. అలాగే ఆయన ముందు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వెలవెలపోయుండవచ్చును. కానీ కాశ్మీర్ పెరట్లో వేర్పాటువాదులకు వత్తాసు పలుకుతున్న ముఖ్యమంత్రికి, అతని ప్రభుత్వానికి బీజేపీయే మద్దతు ఇస్తున్నప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏవిధంగా లభిస్తుంది? కాశ్మీర్ లో మళ్ళీ తలెత్తుతున్న వేర్పాటువాదానికి, దానిని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రికి, పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒకేరకమయిన బలమయిన సంకేతం ఇచ్చినప్పుడే ఈ సమస్య “అదుపులో” ఉంటుంది.
కాశ్మీర్ లో పరిస్థితి ఈవిధంగా ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పరిస్థితి ఇంకో విధంగా ఉంది. దశాబ్దాలు గడుస్తున్నా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుంది. పాకిస్తాన్ కి ఏమాత్రం తీసిపోని దుస్థితిలో ఉంది. నిరుద్యోగం, తత్ఫలితంగా పేదరికం అక్కడ కమ్ముకొని ఉంది. అది సరిపోనట్లు ఉగ్రవాద మూకలు విచ్చలవిడిగా సంచరిస్తుంటాయి. పాక్ సైనికుల బూట్ల చప్పుళ్ళు అక్కడి ప్రజల చెవుల్లో నిత్యం మారుమ్రోగుతూనే ఉంటాయి. భారతదేశం నుండి విడిపోయిన పాపానికి వారికి ఈ పరిస్థితి ఏర్పడిందని భావించవలసి ఉంటుంది.
పొరుగునే ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రజలు పూర్తి స్వేచ్చా స్వాతంత్ర్యాలతో జీవిస్తున్నప్పటికీ వారు పాకిస్తాన్ కి, వేర్పాటువాదానికి, ఉగ్రవాదానికి ‘జై’ కొడుతుంటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో నివసిస్తున్న ప్రజలు ఇప్పుడు భారత్ కి ‘జై’ కొడుతున్నారు. భారత్ పాకిస్తాన్ దేశాలు రెండూ ఒకేసారి స్వాతంత్ర్యం సంపాదించుకొన్నప్పటికీ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని, మతతత్వ ఛాందసవాదాన్ని నమ్ముకొన్నందున దేశంలో నానాటికీ పరిస్థితులు క్షీణిస్తుంటే ఇక చేయగలిగేదేమీ లేక ప్రజల దృష్టిని మళ్ళించేందుకు భారత్ ని బూచిగా చూపిస్తూ కాలక్షేపం చేసేస్తోంది. కానీ భారత్ అభివృద్ధి పధంలో దూసుపోతోంది. ఈ సంగతిని యావత్ ప్రపంచమే కాదు పాకిస్తాన్ (మీడియా) కూడా బాగానే గుర్తించింది. అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ దేశాన్ని, ఉగ్రవాదాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, పక్కలో బల్లెంలా తయారయిన కాశ్మీర్ లో వేర్పాటువాదాన్ని, డాన్ని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రిని ఎందుకో ఇంకా ఉపేక్షిస్తున్నారు. బహుశః దానికి ఏదో ఒక బలమయిన కారణం ఉండే ఉంటుంది అని సర్దిచెప్పుకోక తప్పదు.