అమెరికా అత్యంత సురక్షిత దేశమా? 2012లో ఒక్క ఏడాదిలోనే 8,855 మంది తుపాకుల తూటాలకు బలయ్యారు. 2010లో 11,078 మంది తూటాలకు బలయ్యారు. ఇది ఎవరో చెప్పిన లెక్క కాదు. ఎఫ్.బి.ఐ. వెల్లడించిన వాస్తవం. హటాత్తుగా తుపాకీ మోగడం, అమాయకులు బలికావడం అమెరికాలో షరా మామూలుగా మారింది. అల్ ఖైదా దాడులే అమెరికాపై బయటి శత్రువుల మొదటి, చివరి దాడి… ఇప్పటి వరకు. ప్రపంచానికి ఓ మూలన ఉన్న అమెరికాలోకి ఇతర ఖండాలు, దేశాల వారు దొంగతనంగా, ఆయుధాలతో భూమార్గంలో వెళ్లే అవకాశం లేదు. సరిహద్దులు దాటడం దుర్లభం. జలమార్గంలో చేరే అవకాశం లేదు. నేవీ డేగకళ్లతో పహరా కాస్తుంది. వాయుమార్గంలో బాంబులతో వెళ్తే ఎయిర్ పోర్టు చెకింగ్ లో దొరకడం ఖాయం.
అయినా అమెరికాకు ముప్పు పొంచి ఉంది. అది బయటి శక్తులనుంచి కాదు. లోపలి వ్యక్తుల నుంచే. గన్ కల్చర్ అమెరికా ప్రజలకు శాపంగా మారింది. తాజాగా దక్షిణ ఓరేగాన్ కాలేజీలో కాల్పులు మరో ఘటనగా భావించకుండా, ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవడానికి ప్రభుత్వం ప్రయత్నించకపోతే, రేపు మరో స్కూల్లో తుపాకుల మోత మోగవచ్చు. అమాయక విద్యార్థులు బలికావచ్చు. అమెరికాలో రైఫిల్ అసోసియేషన్ చాలా బలమైన లాబీ. లాలీపాప్ కొన్నంత సులభంగా తుపాకులు కొనే అవకాశం ఉండటం వల్లే అమెరికాలో హత్యలు జరుగుతున్నాయి. కానీ తుపాకుల నిబంధనలు కఠినతరం చేయడానికి ఈ అసోసియేషన్ ఒప్పుకోదు. దాని వెనక ఉన్న బలమైన శక్తులే దీనికి కారణం. అభివృద్ధి చెందిన దేశాల్లో హత్యలు ఎక్కువగా జరిగేవి కొన్ని ఉన్నాయి. వాటిలో అమెరికాది మూడో ర్యాంకు. మెక్సికో, ఎస్తోనియా తర్వాత అమెరికాలోనే తూటాలకు ఎక్కువ మంది బలవుతున్నారు. మాఫియా, వగైరా శాంతిభద్రతల సమస్య ఉన్న దేశాల సంగతి వేరు. అంతర్జాతీ య పోలీసు, పెద్దన్నగా పేరున్న అమెరికాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.
గన్ కల్చర్ కు బలైన భారతీయులూ చాలా మందే ఉన్నారు. దుకాణంలో, రోడ్డు మీద, స్కూల్లో, ఇలా అనేక చోట్ల తూటాలకు ఎంతో మంది భారతీయులు బలైపోయారు. నాలుగు డబ్బులు సంపాదించుకుందామని అమెరికా వెళ్తే ఎప్పుడు ఏ ఉన్నాది విరుచుకు పడతాడో తెలియని భయానక పరిస్థితుల్లో బతకక తప్పడం లేదు. చేతులారా గన్ కల్చర్ ను పెంచి పోషిస్తున్న ప్రభుత్వ విధానాల్లో మార్పు రాకపోతే అమెరికాలో ప్రతి ఏడాదీ వేల మంది ఉన్మాదుల చేతిలో బలికావాల్సి వస్తుంది. బయటి నుంచి ఉగ్రవాదులు వచ్చి దాడులు చేసినా ఇంత మంది ప్రాణాలను పొట్టన పెట్టుకోవడం సాధ్యం కాదేమో. ఎవరూ ఊహించని విధంగా, 2001 సెప్టెంబర్ 11న అల్ ఖైదా ఉగ్రవాదుల దాడుల్లో 2,977 మంది పౌరులు మరణించారు. అమెరికా పౌరులు కొందరు ఉన్మాదంతో కాల్పులు జరపడం వల్ల ఒక్క 2010లోనే 11,078 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగాలా? అలా అయితే బయటి శత్రువులు అవసరం లేదు.