ఒక పార్టీలో సీనియర్ నేత మరొక పార్టీలోకి మారితే ఆయన చేరిన పార్టీ బలపడవచ్చును. కానీ దాని వలన అదే పార్టీలో మరో సీనియర్ బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చును కూడా. రాజకీయ పార్టీలలో ఇటువంటి సంఘటనలు చాలా సార్లు జరిగాయి. బహుశః త్వరలో తెదేపాలో కూడా అటువంటి సంఘటన జరిగేలా ఉంది.
కడప జిల్లా జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి ఈనెల 22లోగా పార్టీని, తన ఎమ్మెల్యే పదవిని విడిచిపెట్టి వేరే పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఆయన తెదేపాలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సంగతి తెలియగానే జమ్మలమడుగు నియోజకవర్గ తెదేపా ఇన్-చార్జ్ పి.రామసుబ్బారెడ్డి పార్టీ కేంద్రకమిటీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని కలిసి తన రాజకీయ ప్రత్యర్ధి అయిన ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని కోరారు. కడప జిల్లాలో తమ రెండు వర్గాలకు మధ్య ఉన్న తీవ్ర విభేదాల గురించి లోకేష్ కి తెలియజేసి ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకొన్నట్లయితే తనకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి ఆయనకి కూడా తన అభ్యంతరాలు తెలియజేయబోతున్నారు. అయినప్పటికీ ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకొన్నట్లయితే రామసుబ్బారెడ్డి పార్టీ వీడక తప్పనిసరి పరిస్థితి రావచ్చును.
పార్టీ మారడం గురించి ఆదినారాయణ రెడ్డి తన సోదరులతో సంప్రదిస్తున్నారు. సోదరులు అందరూ అంగీకరిస్తే వారు తమ నిర్ణయం ప్రకటిస్తారు. పార్టీ మారబోతున్నట్లు ఆదినారాయణ రెడ్డి ప్రకటన చేయగానే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా అప్రమత్తమయ్యారు. పార్టీలో సీనియర్ నాయకుడు మైసూరా రెడ్డి ద్వారా ఆయనను బుజ్జగించేప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఆదినారాయణ రెడ్డిని వైకాపాని వీడి తెదేపాలోకి వస్తే, రామసుబ్బారెడ్డి తెదేపాను వీడి వైకాపాలోకి వెళతారేమో? అప్పుడు లెక్క సరిగ్గా సరిపోతుంది.