రైతుబిడ్డ అయిన ఓ పదో తరగతి విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు ఆత్మహత్యల్లో ఇదో కొత్త కోణం. ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప, రైతుల మేలు పట్టని పాలకుల వైఖరికి మరో నిండు ప్రాణం బలైపోయింది.ఫీజు బకాయిలు 7 వేలకు పేరుకుపోయినా కట్టలేదంటూ క్లాస్ బయట నిలబెట్టాడు, కరీంనగర్ జిల్లా జూలపల్లిలోని ప్రయివేట్ స్కూల్ కరెస్సాండెంట్. అది అవమానంగా భావించడమే కాదు, రైతు అయిన తన తండ్రి ఫీజు కట్టలేదని బాధపడ్డాడు సంతోష్ రెడ్డి అనే విద్యార్థి. అంతే, సెల్ ఫోన్ కెమెరాలో తన బాధను రికార్డు చేసి, రైతు కింద పడి ప్రాణాలు వదిలాడు. అతడి తండ్రి పత్తి మీద మంచి ధర వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాడు. పత్తి విక్రయం జరిగితే కొడుకు స్కూల్ ఫీజు కట్టవచ్చని భావిస్తున్నాడు. కానీ అప్పులు చేసి వ్యవసాయం చేసిన తండ్రి కష్టాలను కళ్లారా చూసిన కొడుకు, తమ బతుకు ఇంతే అనుకున్నాడో ఏమో, ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 6 లక్షల ఎక్స్ గ్రేషియా ప్యాకేజీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అసలు ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని గురించి కనీసం ఆలోచించడానికి కూడా ఈ ప్రభుత్వానికి తీరిక లేనట్టుంది. ఎంత సేపూ ఓట్ల మీదే ధ్యాస. రుణమాఫీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. మరి, 8 వేల కోట్లు రుణమాఫీ కోసం ఇప్పటికే వెచ్చించినా వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు రైతు బిడ్డలు కూడా ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చింది. ఎందుకు? 8 వేల కోట్లూ బూడిదలో పోసిన పన్నీరేనా? రుణ మాఫీ సరైన విధానం కాదని అన్నా హజారే కూడా వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఇలాంటి పథకాలు ప్రవేశ పెడుతున్నారని విమర్శించారు. రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పించేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. విత్తనాల పంపిణీ నుంచి మార్కెట్ యార్డుల్లో లాభసాటి ధర కల్పించే వరకూ ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతును పట్టించుకుంటే ఈ దురవస్థ రానే రాదు. అసెంబ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. విత్తన కంపెనీలు ఎన్నో ఉన్న తెలంగాణలో ఈ దుస్థితి ఎందుకని ఆయన కూడా ప్రశ్నించారు.
అందరూ ప్రశ్నిస్తే జవాబు చెప్పేదెవరు? జవాబు చెప్పాల్సిన ప్రభుత్వమే ప్రశ్నిస్తూ కూర్చుంటే అన్నదాతను ఆదుకునే దెవరు? రుణ మాఫీ పరిధిలోకి ప్రయివేటు అప్పులు తీసుకున్న కౌలు రైతులను ఆదుకునేది ఎవరు? వ్యవసాయంలో 80 శాతం చేసేది కౌలు రైతులే. ఎందుకంటే, పొలం ఉన్న వారిలో 20 శాతం మందే సొంతగా వ్యవసాయం చేస్తారు. మిగతా 80 శాతం మంది కౌలుకు ఇస్తారు. ఓట్లమీద యావను కట్టిపెట్టి, నిజంగా రైతు ఆత్మహత్యలను ఆపాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే, సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవాలి. అవసరమైతే నిపుణుల సలహాలు అడగాలి. రైతు ఇంట చావు డప్పు మోగుతుంటే బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారు కేసీఆర్ గారూ?