హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి ఇవాళ బీహార్‌లో రెండు ఎన్నికల ప్రచారసభలలో పాల్గొన్నారు. భాగల్పూర్ జిల్లాలోని కహల్గావ్ జరిగిన సభలో మాట్లాడుతూ, బీహార్‌కు ప్రధాని నరేంద్రమోడి గతనెలలో ప్రకటించిన రు.1,60,000 కోట్ల ప్యాకేజి బూటకమని అన్నారు. మోడి ప్రజలను తప్పుడు హామీలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన ప్యాకేజిలను రీప్యాకేజ్ చేయటంలో సిద్ధహస్తుడని అన్నారు. గతప్రభుత్వంయొక్క పాత పథకాలను కలగలిపి ఒక కొత్త ప్యాకేజిగా మారుస్తారని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ధరలు తగ్గుతున్నా దేశంలో ఎందుకు తగ్గటంలేదని ప్రశ్నించారు. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలపై ఎన్డీఏ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. మోడి విదేశీ పర్యటనలను గురించి మాట్లాడుతూ, దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవటానికికూడా మోడి సమయం వెచ్చించాలని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగపరంగా ఇవ్వవలసిన రిజర్వేషన్ల విషయంలో తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఈ ఎన్నికలు బీహార్ రాష్ట్రానికేకాక దేశానికికూడా కీలకమని అన్నారు. ఇవి దేశానికి ఒక నూతన దిశానిర్దేశం చేయనున్నాయని, దేశం ఘర్షణవైపు వెళ్ళాలా, శాంతి-అభివృద్ధివైపు వెళ్ళాలా అనేది ఈ ఎన్నికలద్వారా మీరే నిర్ణయించాలని బీహార్ ఓటర్లకు సూచించారు.