హైదరాబాద్: నటుడు కమలహాసన్ ఇవాళ నెల్లూరు నగరంలో పర్యటించారు. ఆయన కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్య నాయుడుతో కలిసి మంత్రి కుటుంబ సభ్యులకు చెందిన స్వర్ణభారతి ట్రస్ట్‌ను సందర్శించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని సురక్ష భీమా యోజన పథకం పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వెంకయ్యనాయుడు సామాజిక సేవను బాధ్యతగా చేస్తున్నారని అన్నారు. స్వర్ణభారతి ట్రస్ట్ సేవలు అభినందనీయమని చెప్పారు. తానుకూడా హైస్కూల్ చదువు మధ్యలో ఆపేశానని, చదువు మధ్యలో ఆపేసినవారిని హీనంగా చూడకూడదని అన్నారు.
వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఏ రాష్ట్రానికీ అందనన్ని నిధులు, పథకాలు ఏపీకి అందాయని చెప్పారు. ప్రతిదానినీ రాజకీయ వివాదంచేయటం సరికాదని అన్నారు. తాత్కాలిక ప్రయోజనాలకోసం అనవసర విమర్శలు చేయొద్దని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటామని, తెలుగువారికి అన్యాయం జరగదని అన్నారు. తెలంగాణకుకూడా మేలుచేస్తామని చెప్పారు. తమిళనాడులో తెలుగుభాష బోధనపై స్పందించిన వెంకయ్య నాయుడు, తప్పకుండా తెలుగుకు ప్రాధాన్యమివ్వాలన్నారు.