హైదరాబాద్: విభజన వలన రెండు రాష్ట్రాలలో ఏర్పడిన అనేక సమస్యలకు తోడుగా టాలీవుడ్‌నుంచి కూడా ఒక సమస్య వచ్చి చేరింది. తెలుగు సినిమాలకు ఏటా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులను ఇచ్చే విషయం తెలిసిందే. ఇప్పుడు విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలు రెండయ్యాయి. అంటే లెక్క ప్రకారం రెండు రాష్ట్రాలూ విడివిడిగా అవార్డులను ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం దీనికి సిద్ధమైందికూడా. ప్రత్యేకంగా లోగోను రూపొందించుకోవాలని నిర్ణయించింది. నంది అవార్డ్ లోగో ఎలాగూ ఏపీ ప్రభుత్వానికి వెళ్ళిపోయింది. అయితే దీనికి సంబంధించి మాటమాత్రంగా అనుకోవటమేగానీ ఒక కార్యాచరణ ప్రణాళిక రెండు రాష్ట్రాలలోనూ రూపుదిద్దుకోలేదు. దీనితో అవార్డ్లకు ఎంపిక, బహుమతి ప్రదానంమాత్రం ఒక్క అడుగుకూడా ముందుకు పడటంలేదు. 2012 సంవత్సరంనుంచి అవార్డ్లు పెండింగ్‌లో పడిపోయాయి. ఇంతకుముందు ఆఖరుగా 2013 సంవత్సరంలో నంది అవార్డుల బహూకరణ కార్యక్రమం జరిగింది. నాటి కార్యక్రమంలో 2011 సంవత్సర అవార్డులను బహూకరించారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నంది అవార్డ్‌ల విషయంలో కొన్ని సలహాలు ఇస్తోంది. ఒక సంవత్సరం తెలంగాణ, మరో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఈ అవార్డ్‌ల ఎంపిక, బహూకరణను నిర్వహించాలని, లేనిపక్షంలో రెండు ప్రభుత్వాలూ కలిసి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించింది. మరోవైపు, చలనచిత్ర నిర్మాతలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రు.3 కోట్ల మేర బకాయి పడిందని, ఏపీ ప్రభుత్వం దానిని తక్షణమే విడుదలచేయాలని ఫిల్మ్ ఛాంబర్ అభ్యర్థించింది. విభజనవలన తెలుగు చలనచిత్ర పరిశ్రమ నష్టపోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఫిల్మ్ ఛాంబర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖమంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌కు వినతిపత్రాలు సమర్పించింది. దీనిపై ప్రభుత్వాలు స్పందించాల్సిఉంది.