మన ఘనమైన ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎలా అర్థం చేసుకోవాలి ? దేశాన్ని శరవేగంతో అభివృద్ధి చేయగల సత్తా ఉన్న మనిషి అనుకోవాలా? లేక చివరకు మహాత్మా గాంధీని సైతం తన రాజకీయ తురుఫు ముక్కగా ఎంచుకున్న మహేంద్రజాలికుడనుకోవాలా? నిజంగానే ఆయన పూజ్య బాపూజీపట్ల ప్రేమ చూపిస్తున్నారా? లేక కాంగ్రెస్ వాళ్ల సొంతం అనుకుంటున్న గాంధీని తనవైపుకు లాక్కునే ప్రయత్నమా? మోదీని ఎలా అర్థం చేసుకోవాలి??
`ఈ క్రింది పేర్కొన్న గాంధీల్లో అసలు గాంధీ ఎవరు?’ ఈప్రశ్నని కౌన్ బనేగా కరోడ్ పతిలాంటి కార్యక్రమాల్లో ఇచ్చుకోవచ్చు. గాంధీ పేరుతో చలామణి అవుతున్న కాంగ్రెస్ నాయకుల వల్ల అసలు గాంధీ తెరమరుగైపోతున్నాడు. దీంతో నకిలీ గాంధీల మధ్య అసలు గాంధీని గుర్తించడం, ఆయన సిద్ధాంతాలను తెలుసుకోవడం చాలామందికి కష్టమైపోతోంది. చివరకు కాంగ్రెస్ వాళ్లే గాంధీల వ్యవహారంపై గందరగోళ పరిస్థితిని ఎదుర్కోవాల్సివస్తున్నది. ఇది కాంగ్రెస్ చేసుకుంటున్న స్వయంకృతాపరాధం. ఇంతలో మరో పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పట్టించుకోని మహాత్మా గాంధీ ఆలోచనలను, మార్గదర్శకాలను నెత్తినపెట్టుకుని ఊరేగే వ్యక్తి ఒకరు ఈమధ్య సీన్ లోకి వచ్చాడు. ఆ వ్యక్తి చాలా ఘటికుడు. మెలికలు తిరిగిన కాంగ్రెస్ వస్తాదులనే పల్టీకొట్టించేస్తున్నాడు. రాజకీయ మాయాజాలం చేయగల గడుసరి. కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేకి. కానీ అదే కాంగ్రెస్ కోసం చివరివరకూ ఉంటూ దేశం కోసం పోరాడిన బాపూజీకి మాత్రం శతకోటి వందనాలు సమర్పించుకుంటున్నాడు. అతను మరెవరో కాదు, ప్రధాని నరేంద్ర మోదీ. ఈయన బాపూ నామస్మరణ చేస్తుంటాడు. తన పథకాలకు బాపూజీనే స్ఫూర్తని అంటాడు.
ఇది ఇలాఉంటే, గాంధీ కార్డుని అస్త్రంగా మలుచుకున్న మోదీ వ్యూహంతో అటుపక్క కాంగ్రెస్ నాయకులు దిమ్మెరపోతున్నారు. ఇది చాలదన్నట్టుగా తమ అగ్రనేత మోదీ మార్గాన్నే అనుసరిస్తుంటే మనమెందుకు ఫాలోకాకూడదనుకున్న దిగువ స్థాయి బిజేపీ నాయకులు, కార్యకర్తలు మోదీని ఈ తరం గాంధీగా అభివర్ణిస్తూ హోర్డింగ్స్, కటౌట్స్, కరపత్రాలు తయారుచేసి ఘనకార్యం వెలగబెట్టినట్లు తెగ సంతోషపడుతున్నారు. దీంతో మహాత్మా గాంధీ గురించి అంతగా పట్టించుకోనందుకు కాంగ్రెస్ నేతలు పరితపించాల్సివస్తున్నది. ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే, గాంధీని పేరుచివర తగిలించుకున్నవారంతా తమ రాజకీయ దుకాణానికి తాళంకప్ప తగిలించుకోకతప్పదు.
కాంగ్రెస్ మూలాలు…
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ నీ, దాని ఉనికికి మూలమైన వ్యక్తులను విస్మరించడం ఎంతపెద్ద తప్పిదమో తెలుసుకునేరోజు దగ్గర్లోనే ఉంది. దేశ రాజకీయాల్లో జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఉన్న విశిష్టత, బలం అలాంటివి.
19వ శతాబ్దంలో మనదేశంలో రాజకీయ చైతన్యం చాలా తక్కువగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఆంగ్లవిద్యను అభ్యసించిన భారతీయ మేధావులకు విదేశీ సంస్కృతితో సంబంధం ఏర్పడింది. అప్పటికే అనక దేశాల్లో ప్రాధాన్యం సంతరించుకున్న ప్రజాస్వామిక భావజాలం వారిని ఆకట్టుకుంది. తమ దేశం కోల్పోయింది ఏమిటో వారు గుర్తించారు. ఈ లోటును పూడ్చడానికి రాజకీయ చైతన్య వేదికలు ఏర్పాటుచేసుకున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని ప్రజాస్వామ్యవాది అయినఆంగ్లేయ అధికారి ఏ.ఓ హ్యూమ్ ప్రారంభించారు. కాగా, గాంధీ 1914లో దక్షిణాఫ్రికానుంచి స్వదేశానికి తిరిగివచ్చిన తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనడం ప్రారంభించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ తరఫున పనిచేశారు. 1932లో లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టికి ఏకైక ప్రతనిధిగా గాంధీ హాజరయ్యారు. గాంధీజీ లేకుండా కాంగ్రెస్ పార్టీని ఊహించే పరిస్థితి లేదప్పుడు. అలాంటి గాంధీ ఇప్పుడు 2015వ సంవత్సరానికి వచ్చేసరికి కాంగ్రెస్ వాళ్ల మనోభావాల నుంచి క్రమంగా దూరమైపోతున్నారు. ఇప్పుడు గాంధీ అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధే, ఇంకాస్త వెనక్కివెళితే ఇందిరాగాంధీ వరకే గుర్తుంచుకునే పరిస్థితి ఏర్పడింది. జాతీయ కాంగ్రెస్ పార్టీకి , స్వాతంత్ర్య ఉద్యమానికి ఆయన చేసిన సేవలేమిటని అడిగితే నోరెళ్ళబెట్టాల్సిన పరిస్థితే ఎదురవుతోంది. మహాత్మా గాంధీని మనసులో నిలుపుకునే విషయంలో నేటి కాంగ్రెస్ నాయకులు విఫలమవుతున్నారు. గాంధీ సిద్దాంతాలనూ, మార్గదర్శకాలను ఎవరైనా గుర్తుచేస్తే, తెల్లమొహం వేస్తున్నారు.
మోదీ మనసులో గాంధీ
సరిగా ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కాంగ్రెస్ నాయకత్వంలోని యుపీఏని ఓడించి గద్దెనెక్కింది. నరేంద్ర మోదీ ఆలోచనలు, పట్టుదల, కృషి పార్టీని ఉన్నత శిఖరాలకు చేర్చింది. ప్రధాని మోదీ మొదటి నుంచీ గాంధీ మార్గాలను గుర్తుచేసుకుంటూ అందుకు తగ్గట్టుగా సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం మొదలెట్టారు. గాంధీ వాడిన కళ్లజోడు బొమ్మతో స్వచ్ఛ్ భారత్ మొదలుపెట్టారు. అంతేకాదు, అవకాశం ఉన్నప్పుడల్లా గాంధీ చెప్పిన మార్గదర్శక సూత్రాలను ఉటంకిస్తున్నారు. దీంతో పరిస్థితిలో నెమ్మదిగా మార్పువచ్చింది. మహాత్మా గాంధీ ఆలోచనలను, సిద్ధాంతాలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు అర్థంచేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. తమ ప్రియతమ నాయకుడు మోదీ పూజ్య బాపూజీ సిద్ధాంతాలను ఫాలో అవుతున్నప్పుడు మనమెందుకు అనుసరించకూడదన్న ఆలోచనలకు బీజం పడింది. ఇదేమీ ఇప్పటికిప్పుడు వచ్చిన మార్పుకాదు. ఏడాదిగా వచ్చిన మార్పు. ఇప్పుడిప్పుడు మోదీ పూజ్య గాంధీ అంతటి వారన్న అర్థం వచ్చేలా మాట్లాడటం మొదలుపెట్టారు. వారి దృష్టిలో మోడ్రన్ గాంధీ వారి ప్రియతమ నాయకుడు మోదీనే.
కక్కలేరు.. మ్రింగలేరు
ఇక కాంగ్రెస్ వాళ్ల పరిస్థితి ఎలా ఉంది? తాము ఇన్నాళ్లూ పట్టించుకోకపోయిన జాతిపిత గాంధీని అవతలివాళ్లు పట్టించుకోవడం కాంగ్రెస్ వాళ్లకు నచ్చడంలేదు. అయినప్పటికీ వారిది కక్కలేరు, మ్రింగలేని పరిస్థితే. ఆ వర్గాల్లో ఆగ్రహం కలుగుతున్నా, `ఆ’ గాంధీ పేరు తలుచుకుంటే `ఈ’ గాంధీలకు ఎక్కడ కోపం వస్తుందోనని మౌనముద్రవేసుకుని కూర్చోవాల్సివస్తున్నదని ఆ పార్టీ వాళ్లే అంటున్నమాట. సోనియా, రాహుల్ వంటి పై స్థాయి నాయకులు- అసలు గాంధీని పట్టించుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గాంధీ అన్నది ఇంటిపేరో, తోకపేరో కాదనీ, ఆ పదంలో జాతీయతాభావం దాగున్నదని వారు ఏమాత్రం గుర్తిస్తున్నట్టులేదు. గాంధీ అన్నది వారి వారసత్వ సంపద అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇదే అదునుగా తీసుకుని మోదీ తనదైన శైలిలో బాపూ మంత్రం పఠిస్తున్నారు. ఇది ఎక్కడిదాకా వెళ్ళిందంటే, బాపూనీ, మోదీని కలిపి హోర్డింగ్స్ తయారుచేస్తూ, మోదీ నవయుగ గాంధీ అన్నట్లు ప్రచారం చేసే స్థాయికి వెళ్లడం. గాంధీ, మోదీలు ఇద్దరూ గుజరాత్ లో జన్మించడం ఇలాంటి ప్రచారకర్తల చేతులకు మరోపాయింట్ దొరికినట్లయింది. వీరిద్దరూ గుజరాత్ ముద్దుబిడ్డలంటూ ప్రచారపత్రాల్లో చాటిచెబుతున్నారు. మొత్తానికి మోదీని గాంధీ స్థాయికి తీసుకువెళ్లడమే వీరి పనిలా కనబడుతోంది.
ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, మున్ముందు ఎన్నికల ప్రచారంలో బాపూజీ బొమ్మలు బీజేపీ పోస్టర్లు, హోర్డింగ్స్ , కటౌట్ల మీద కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బాపూ తర్వాత మోదీ…మధ్యలో మరెవ్వరూ లేరన్న ఇమేజ్ కలిగించే ప్రయత్నం జరగవచ్చు. ఏతావాతా, గాంధీ కాంగ్రెస్ నుంచి దూరమై బీజేపీకి దగ్గరైనట్లు ప్రజలకు అనిపించవచ్చు. చివరకు ఇది ఎటు దారితీస్తుందో చూడాలి.
– కణ్వస