ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా అనుమానమే అని దాదాపు అందరికీ అర్థమైంది. ఇక, జాతీయ పార్టీగా ప్రకటించుకున్న తెలుగు దేశం పార్టీకి అధికారికంగా ఆ హోదా దక్కడం అనుమానమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది అసాధ్యం కాకపోయినా చాలా కష్టసాధ్యం. చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. రెండు రాష్ట్రాలకూ కమిటీలూ పొలిట్ బ్యూరో వగైరా విభాగాలూ హంగూ ఆర్భాటాలతో ఆదివారం ఎన్టీఆర్ భవన్ కళకళలాడింది. ఇంతకీ టీడీపీ జాతీయ పార్టీగా ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందగలదా? ఇప్పుడున్న పరిస్థితిల్లో పొందలేదు. భవిష్యత్తులో పొందగలదా అంటే అదీ అనుమానమే. జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి.
కనీసం నాలుగు రాష్ట్రాల్లో 6 శాతం చొప్పున ఓట్లు పొంది ఉండాలి. లేదా లోక్ సభ మొత్తం సీట్లలో కనీసం 2 శాతం గెలవాలి. ఆ సభ్యులు కనీసం మూడు రాష్ట్రాల నుంచి గెలిచి ఉండాలి. లేదా కనీసం నాలుగు రాష్ట్రాల్లో అది ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. లోక్ సభ మొత్తం సభ్యుల సంఖ్య 543. ఈ లెక్కన 2 శాతం అంటే కనీసం 10 సీట్లను, అదీ మూడు రాష్ట్రాల నుంచి గెలవాలి. ఈ నిబంధనల ప్రకారం టీడీపీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందడం ప్రస్తుతానికి సాధ్యం కాని విషయం. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు ఉంది. నాలుగు రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు అనేది ఇప్పట్లో సాధ్యం కాని విషయం. మూడు రాష్ట్రాల నుంచి 2 శాతం మంది ఎంపీలు అనేదీ కష్టసాధ్యమే. ఏపీ, తెలంగాణతో పాటు మరో రాష్ట్రంలో లోక్ సభ సీటు గెలవడానికి చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఒడిషా, తమిళనాడులో తెలుగువారి ప్రాబల్యం గల ప్రాంతాలున్నాయి. అయితే లోక్ సభ సీటును గెలవడం సాధ్యమా అనేది ప్రశ్న. పైగా తమిళనాడులో ద్రవిడ పార్టీలదే హవా. అక్కడ టీడీపీ పాగా వేయడం అనుమానమే. ఉన్నంతలో మెరుగైనా మార్గం ఒకటి కనిపిస్తోంది. కర్ణాటకలో బీజేపీని ఒప్పంచి, తెలుగు వారు అధికంగా ఉన్న సీటు నుంచి పోటీ చేసి గెలవడం ఒక మార్గం. ఆ రాష్ట్రంలో బీజేపీ బలమైన పార్టీ. తెలుగువారు అధికంగా ఉన్న చోట టీడీపీ ఇప్పటి నుంచే బలాన్ని పెంచుకుంటే ఒక సీటును గెలవడం అసాధ్యం కాకపోవచ్చు. అది జరుగుతుందా లేదా అనేది అప్పుడే చెప్పలేం. పైగా 2015లో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. ఇక చివరి నిబంధన ప్రకారం, నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందడం చాలా కష్టం.
చాలా కాలంగా జాతీయ పార్టీలుగా కొనసాగిన బీఎస్పీ, సీపీఐ, ఎన్.సి.పి.లకే ఆ హోదాను కాపాడుకోవడం కష్టంగా ఉంది. అలాంటిది తెలుగు దేశం జాతీయ హోదా పొందాలంటే దీర్ఘ కాలిక వ్యూహంతో చాలా కష్టపడాల్సి ఉంటుంది.