బందరు ఓడరేవుకి ఎంత స్ధలం కావాలి? అన్నవివాదం తెలుగుదేశం మీద ప్రజల నమ్మకాన్ని గట్టిగా దెబ్బతీసేలా వుంది. అధికారంలోకి రావడానికి నోటికొచ్చిన మాటలు అనేస్తారా అని బందరు పోర్టుని ఉదాహరించి ప్రశ్నిస్తే ఆపార్టీ దగ్గర సమాధానం లేదు. బందరు ఓడరేవుని 400 ఏళ్ళక్రితం డచ్చివారు అభివృద్ధి చేశారు. ఈరేవునుంచే వారి హయాంలో ఎగుమతి దిగుమతులు జరిగేవి. డచ్చివారు దేశంనుంచివెళ్ళిపోయాక కూడా ఓడరేవు కార్యకలాపాలు దశాబ్దాల తరబడి సాగాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంవల్లా, ఆధునిక యంత్రసదుపాయాలు లేకపోవడం వల్లా అక్కడ కార్యకలాపాలు క్షీణముఖం పట్టి 40 ఏళ్ళక్రితం పూర్తిగా స్తంభించిపోయాయి.
బందరు పోర్టుని పునరుద్ధరించాలని స్ధానికులు ఆందోళన చేయడంతో 2008 లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కరఅగ్రహారం వద్ద పోర్టుకి శంకుస్ధాపన చేశారు. పోర్టుకోసం 5 వేల ఎకరాలు కేటాయించగలమన్నారు. అయితే భూమికేటాయింపు, నిధుల విడుదలా జరగలేదు. తక్షణం పనులు ప్రారంభించాలని ఏడాదిన్నరకు పైగా రిలేనిరాహారదీక్షలు చేశారు. 2012 లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 5300 ఎకరాల భూమిని పోర్టుకి కేటాయిస్తూ జివో జారీ చేయించారు. అప్పుడు ఆందోళనకారులను పరామర్శించిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే ఆరునెలల్లో పోర్టు పనులు ప్రారంభించగలమనీ, ఇందుకు కేవలం రెండున్నరవేల ఎకరాలు సరిపోతాయనీ ప్రకటించారు.
తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసింది. 15 నెలల తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 31వ తేదీన పోర్టు అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం 24 గ్రామాల పరిధిలో 30 వేల ఎకరాల భూమి అవసరమని గుర్తించింది. దీన్లో 14,427 ఎకరాల ప్రైవేట్ భూమి సేకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మరో 15,573 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూమిని సేకరించేందుకు సిద్ధమైంది. ఇందుకు కనీసం ఆరుగ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించవలసి వుంటుంది. దేశంలోనే మూడవస్థానంలో ఉన్న చెన్నయ్ పోర్టు కేవలం 587 ఎకరాల్లోనే ఉంది. కొచ్చిన్ ఓడరేవు రెండు వేల ఎకరాల్లో నిర్మాణం చేశారు. మంగుళూరు 1700 ఎకరాల్లో ఉంది. విశాఖపట్నం దగ్గర కొద్దికాలంక్రితమే నిర్మించిన ప్రైవేట్ ఓడరేవు 2000 ఎకరాల్లోనే వుంది.
2,500 ఎకరాల భూమి పోర్టుకు సరిపోతుందని చెప్పిన తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక మాటమార్చి 30 వేల ఎకరాలు అవసరమని ఎందుకు నిర్ణయించింది? సన్న, చిన్న రైతుల నుంచి వారి జీవనాధారంగా ఉన్న భూముల్ని భూసేకరణ పేరుతో ఎందుకు బలవంతంగా లాక్కోవాలని చూస్తోంది.?
ప్రపంచబ్యాంక్ సూచనలవ్రకారం పెట్టుబడిదారులకు లాండ్ బ్యాంకుని సిద్ధం చేసి ఆన్ లైన్ లో వుంచడమే ఇందుకు కారణమని అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెప్పగలుగుతారు…మనుషులకూ, నాయకులకే కాక ప్రభుత్వానికి కూడా భూదాహం వుంటుందా? కాకుల్ని కొట్టి గద్దలకు వేసే దళారీతనానికి స్వయంగా ప్రభుత్వమే తెగబడుతుందా? అంటున్న వ్యవసాయదారుల కడుపుమంటకీ,ఆక్రోశానికి నివారణకాదు కదా, కాస్తంత ఉపశమనం కూడా దొరికేలా లేదు.
సుదీర్ఘకాల ప్రజాఉద్యమం నుంచి, మూడేళ్ళ పోరాటం నుంచీ మంజూరైన బందరు పోర్టు ముప్పైవేల ఎకరాల్ని కబళించి అదే ప్రజల జీవనాన్ని ధ్వంసం చేస్తే సహించేదిలేదని కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి. బందరు పోర్టు కి భూసేకరణ సైజుని మార్చుకోకపోతే తెలుగుదేశం అతితీవ్రంగా నష్టపోకతప్పని వాతావరణం రూపుదిద్దుకుంటోంది.