ఇంతలోనే ఎంత మార్పు? వైకాపాలోకి వెళ్ళబోయి దారి తప్పి తెదేపాలోకి వచ్చిపడిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇప్పుడు వైకాపానే విమర్శలు చేస్తుండటం ఎంత విచిత్రం? వైకాపా నేత అంబటి రాంబాబు ద్వారా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కాంటాక్ట్ చేసి వైకాపాలోకి చేరడానికి డొక్కా మాణిక్యవరప్రసాద్ సిద్దం అయినప్పుడు గురువుగారు రాయపాటి సాంభశివరావు అడ్డుపడి తెదేపాలోకి తీసుకు వచ్చేరు. డొక్కావారు చాలా పెద్ద మనిషి కనుక వైకాపాకి హ్యాండ్ ఇచ్చినందుకు అంబటికి క్షమాపణలు కూడా చెప్పుకొన్నారు. కానీ ఇప్పుడు అదే డొక్కావారు జగన్మోహన్ రెడ్డిని “అర్ధం పర్ధం లేని దీక్షలు చేస్తూ ముఖ్యమంత్రి అవుతానని కలలు కంటున్నారు. కానీ ఎన్ని కలలు కన్నా జగన్ ముఖ్యమంత్రి కావడం అసంభవం,” అని ఎద్దేవా చేసారు.
ఒకవేళ ఆనాడు రాయపాటి అడ్డుపడకపోయుంటే డొక్కావారు కూడా ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చొని దీక్షలు చేస్తుండేవారు. చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక విధానాలను విమర్శిస్తుండేవారు. కానీ దారి తప్పి తెదేపాలోకి వచ్చిపడటంతో జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారిప్పుడు. రాజకీయాలలో ఇటువంటి విచిత్రాలు చాలా సహజమే అయినా “ఔరా…ఇంతలోనే ఎంత మార్పు?” అని జనం ముక్కున వేలేసుకోలేకుండా ఉండలేకపోతున్నారు.