హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రెచ్చిపోయారు. ఇటీవలి చైనా పర్యటనలో కేసీఆర్ బృందం మకావు వెళ్ళి తాగి తందనాలాడిందని చెప్పారు. కేసీఆర్ బృందం పాస్‌పోర్ట్‌లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సచివాలయంలో బర్త్‌డే పార్టీలు చేసుకుంటున్నారని ఆరోపించారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లో ఇవాళ రైతులకోసం చేపట్టిన దీక్షలో రేవంత్ ప్రసంగించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రజలు రజాకార్ల లాగుల్లోకి తొండలు వదిలేవారని, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులను అలాగే వేప చెట్లకు కట్టేసి లాగుల్లో తొండలు వదిలిపెట్టాలని అన్నారు. రైతులను ఆదుకోవటానికి కేసీఆర్ ప్రభుత్వం ముందుకు రావటంలేదని ఆరోపించారు. కేసీఆర్‌ను వదిలించుకుంటే తప్ప భవిష్యత్తు లేదని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. అన్ని పార్టీలూ జెండాలు పక్కన పెట్టి రైతులకోసం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదిరించటానికి ముందుకొచ్చాయని రేవంత్ అన్నారు. కేసీఆర్ కుమార్తె కవిత బయటకొచ్చి రైతులకోసం జోలె పట్టుకోవటంద్వారా తన తండ్రి తాగుబోతు, చేతకానివాడని చెప్పకనే చెప్పారని విమర్శించారు. కేసీఆర్‌కు మీడియా కూడా భయపడుతోందని, వాస్తవాలు బయటపెట్టటంలేదని అన్నారు.