మంత్రులు గంటా శ్రీనివాస రావు, అయ్యన్నపాత్రుడుకి భోగాపురం సమీపంలో భూములు ఉన్నందున వారికి లబ్ది కలిగించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ అవసరం లేకపోయినా విమానాశ్రయం నిర్మించాలనుకొంటున్నారని జగన్ ఆరోపించారు. జగన్ చేసిన విమర్శలపై మంత్రి గంటా ఇంకా స్పందించలేదు కానీ అయ్యన్నపాత్రుడు వెంటనే స్పందించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ “అవును నాకు అక్కడ ఒక రిసార్ట్, దానిని ఆనుకొని భూములు ఉన్నాయి. కానీ అక్కడ అయ్యన్నకి భూములు ఉన్నాయామరొకరికి ఉన్నాయా అనేది కాదు ప్రశ్న. కేంద్రప్రభుత్వం సూచించినట్లుగా విమానాశ్రయం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నామన్నదే ముఖ్యం. కానీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అవగాహనా లేకుండా నోటికి వచ్చినట్లు ఎవరి మీద పడితే వారి మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేసి ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఒకవేళ విమానాశ్రయం నిర్మాణానికి నా భూములు కూడా అవసరమయితే వాటిని వాదులు కోవడానికి నేను సిద్దంగా ఉన్నాను,” అని అన్నారు.
జగన్ చేసిన ఆరోపణలకు అయ్యన్న జవాబిచ్చారు. కానీ తెదేపా అధ్యక్షుడు కళా వెంకట రావు అడిగిన ప్రశ్నకు జగన్ ఇంతవరకు జవాబు ఇవ్వలేదు. భోగాపురం చుట్టుపక్కల జగన్మోహన్ రెడ్డికి బినామీ పేరుతో భూములు ఏమయినా ఉన్నాయా? అవేమయినా విమానాశ్రయం క్రింద పోతున్నాయా? అందుకే జగన్ వచ్చి ధర్నా చేస్తున్నాడా? అని ప్రశ్నించారు. వీరిద్దరి వాదోపవాదాలు పక్కనబెడితే ఇంకా మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా జగన్ చేసిన ఆరోపణలపై స్పందించా వలసి ఉంది. మరి ఆయనేమంటారో ఈ భూముల వ్యవహారం గురించి?