మహేంద్ర సింగ్ ధోనీ రూటే వేరు. అతి తక్కువ సమయంలో స్టార్ క్రికెటర్ గా ఎదగడమే కాదు, అనూహ్యంగా కెప్టెన్ అయిపోయాడు. జార్ఖండ్ డైనమైట్ రేంజి ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఇప్పుడు ధోనీ వెండితెర మీద కూడా కనువిందు చేయబోతున్నాడు. ఎలాగంటే, ధోనీ బయోపిక్ త్వరలోనే వెండితెర మీద ప్రత్యక్షం కాబోతుంది. ఎం.ఎస్. ధోనీ, ద అన్ టోల్డ్ స్టోరీ పేరుతో సినిమా రెడీ అవుతోంది. ఇందులో ధోనీ భార్య పాత్రకు నటి ఫిక్స్ అయింది. అయితే అతడి మాజీ గర్ల్ ఫ్రెండ్ పాత్రకు తగిన అమ్మాయి కోసం వెతికారు. సినీ రంగానికి కొత్త అమ్మాయి ఈ పాత్రకు బెటర్ అని దర్శకుడి ఉద్దేశం. చివరకు దిశా పటాని ఆ పాత్రకు సూటవుతుందని ఫిక్స్ అయ్యారట.
పాపం ఈ అమ్మడు ఇప్పటికే రెండు భారీ ప్రాజెక్టులను మిస్సయింది. బాఘీ సినిమాలో టైగర్ ష్రాఫ్ కు హీరోయిన్ కావాల్సింది. ఆఖరి నిమషంలో ఆ పాత్ర కాస్తా శ్రద్ధా కపూర్ కు దక్కింది. మరో సినిమా చాన్స్ కూడా అలాగే మిస్సయింది. ఎలాగైనా మంచి ప్రాజెక్టుతో బాలీవుడ్ కెరీర్ కు శ్రీకారం చుట్టాలని తహతహలాడుతోంది. ఎట్టకేలకు ధోనీ సినిమా రూపంలో ఓ మాంచి చాన్న్ వచ్చేటట్టుంది. దీని కోసం ఆడిషన్ ఇచ్చేసింది. ఇప్పుడీ భామ ఆశలన్నీ ధోనీ సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమా ఓకే కావాలి, నిర్మాణం పూర్తి కావాలి, విడుదలయ్యాక సూపర్ హిట్ కావాలి, ఇదే ధ్యాస.
అందుకే, పరోక్షంగా ఈ అందాల రాశికి బ్రేక్ ఇచ్చేది ధోనీయే అన్న మాట. దిశా పటాని మాత్రమే కాదు, ధోనీ బయోపిక్ కోసం అతడి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది ఏ రేంజిలో ఉంటుందో అని అప్పుడు చర్చించుకుంటున్నారు.