ఎన్నికలలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు విచ్చల విడిగా డబ్బు, మద్యం, బహుమతులు పంచిపెట్టడం కొత్తేమీ కాదు. అదే విషయాన్ని బీహార్ మరొకమారు దృవీకరించారు. ఓట్లు వేసేందుకు డబ్బు తీసుకొంటే తప్పు కాదని బీహార్ రాష్ట్రంలో 80శాతం మంది ప్రజలు అభిప్రాయపడినట్లు ఒక తాజా సర్వేలో వెల్లడయింది. ఆ సర్వేను ఏదో అనామక మీడియా సంస్థ నిర్వహించలేదు. సాక్షాత్ బీహార్ ఎన్నికల సంఘం అద్వర్యంలో పాట్నాకి చెందిన చంద్రగుప్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజెమెంట్ జూన్-జూలై నెలల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన సర్వేలో ఈ విషయం బయటపడింది.
అది చూసి షాక్ అయిన బీహార్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఆర్. లక్ష్మణన్ బీహార్ ఓటర్లను చైతన్య పరిచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్చంద సంస్థల సహకారంతో పెద్ద ఎత్తున ప్రచారం చేయిస్తున్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని సమర్దులయిన ప్రజా ప్రతినిధులను ఎన్నుకోమని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య సదస్సులు నిర్వహించారు. రాష్ట్రమంతటా పోస్టర్లు పెట్టించారు. కానీ అంత మాత్రాన్న బీహార్ ప్రజలు రాజకీయపార్టీలు ఇవ్వజూపుతున్న డబ్బు, మద్యం, విలువయిన బహుమతులను కాదనుకొంటారా? బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కొడుకు వయసు 25సం.లు చిన్న కొడుకు వయసు 26సం.లు అని ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేసి దానిని నిర్భయంగా సమర్ధించుకొంటున్నారు. యధారాజ తధాప్రజా అన్నట్లుగా బీహార్ ప్రజలు కూడా డబ్బు తీసుకొని ఓటేయడం తప్పేమీ కాదని చెపుతున్నారు.