ఆలూ లేదు…చూలు లేదు… కొడుకు పేరు సోమలింగం…అన్నట్లుంది తెదేపా ప్రభుత్వ ఆలోచన. వచ్చే శీతాకాల సమావేశాలను తుళ్ళూరులో భూమిపూజ చేసిన చోటే నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకొంటున్నట్లు తాజా సమాచారం. అందుకు అవసరమయిన అన్ని ఏర్పాట్లు చేసేందుకు ఒక ప్రైవేట్ సంస్థకు బాధ్యతలు అప్పగించవచ్చని తెలుస్తోంది. అన్ని సౌకర్యాలు ఉన్న విజయవాడ , విశాఖ నగరాలలో శాసనసభ సమావేశాలు నిర్వహించడానికే వెనుకాడిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం వెళ్ళడానికి సరయిన రోడ్డు, పదిమంది కూర్చొని సమావేశం అయ్యేందుకు చిన్న భవనం కూడా లేని తుళ్ళూరులో శాసనసభ సమావేశాలు నిర్వహించాలనుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. రాజధాని నిర్మాణం ఇంకా మొదలుకానప్పుడు తుళ్ళూరులో శాసనసభ సమావేశాలు ఎందుకు నిర్వహించాలనుకొంటోందో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న వివిధ శాఖలకు, సమర్దులయిన అధికారులకు ఆ ఏర్పాట్ల బాధ్యత అప్పగించకుండా ప్రైవేట్ సంస్థకు అప్పగించడం మరీ విచిత్రంగా ఉంది. రాజధాని శంఖుస్థాపన కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ఆ బాధ్యతని కూడా ముంబైకి చెందిన విజ్ క్రాఫ్ట్స్ ఈవెంట్ మేనేజిమెంట్ అనే సంస్థకి కట్టబెట్టింది. దానికోసం ఏకంగా రూ.9.5కోట్లు ఆ సంస్థకు చెల్లిస్తోంది. ప్రభుత్వం చేతిలో అనేక మంది సమర్దులయిన అధికారులు ఉండగా వారికి ఆ బాధ్యత అప్పగించకుండా ఈవిధంగా ప్రతీ పనిని కాంట్రాక్టర్లకు అప్పగించడం చూస్తుంటే ప్రభుత్వానికి తన శాఖల పనితీరుపై, అధికారులపై అంత నమ్మకం లేదని భావిస్తున్నట్లుంది.