హైదరాబాద్: “చూడు… ఒక వైపే చూడు… రెండోవైపు చూడలాలనుకోకు… తట్టుకోలేవు… మాడిపోతావ్” – ఇదీ నందమూరి బాలకృష్ణ ‘సింహా’ సినిమాలో చెప్పిన డైలాగ్. బాలయ్య అల్లడు కమ్ మేనల్లుడు లోకేష్ కూడా ఇప్పుడు అదే లెవల్లో జగన్కు వార్నింగ్ ఇస్తున్నారు. తెలుగుదేశంపార్టీకి 55 లక్షలమంది కార్యకర్తలున్నారని, తమవాళ్ళు కళ్ళు తెరిస్తే తట్టుకోలేవ్ అని హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో ఎక్స్ అఫిషియో సభ్యుడు లోకేష్ నిన్న గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జగన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. జగన్ గుంటూరులో తలపెట్టిన దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు తగలపెడదామని, కలెక్టరాఫీసులు ధ్వంసం చేద్దామని, ఆత్మహత్యలకు ప్రేరేపిద్దామని వైసీపీ నేతలు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. ఈ సందర్భంగా వాళ్ళకు ఒకటే చెబుతున్నానని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క కార్యాలయ అద్దం పగిలినా, ఒక్క యువకుడి బలవన్మరణం జరిగినా అందుకు జగన్నే బాధ్యుడిని చేసి, కేసులో ఆయనను ఏ-1గా చేర్చేదాకా పోరాడతామని చెప్పారు. తమకు వారిలాగా దొంగ ఛానల్, పేపర్ లేవని, 55 లక్షలమంది కార్యకర్తలు ఉన్నారని అన్నారు. వారందరూ కళ్ళు తెరిస్తే తట్టుకోలేరంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.