హైదరాబాద్: నల్గొండ జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది చనిపోయారు… పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి, ఇతర ఆసుపత్రులకు తరలించారు. రామన్నపేట మండలం తుమ్మలగూడెం సమీపంలో ఒక మూల మలుపువద్ద లారీ, ఆర్టీసీ బస్సు ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులున్నారు. లారీ తాకిడికి తల్లకిందులైన బస్సు నుజ్జునుజ్జు కూడా అయిపోయింది. లారీలో పుస్తకాల లోడు ఉన్నట్లు తెలిసింది. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో ఆరా తీస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు జగదీశ్వరరెడ్డి, మహేందర్ రెడ్డిలను ఘటనాస్థలానికి వెళ్ళాలని ఆదేశించారు. ఆ మంత్రులు ఘటనాస్థలానికి బయలుదేరారు. నార్కట్‌పల్లి డిపోకు చెందిన ఈ బస్సు భువనగిరినుంచి నల్గొండ వెళుతోంది. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మృతులసంఖ్య మరింత పెరిగే అవకాశముందంటున్నారు. లారీ హర్యానాకు చెందినదని, లారీ డ్రైవర్, బస్సు డ్రైవర్ కూడా చనిపోయారని సాక్షులు చెబుతున్నారు. నల్గొండ, భువనగిరినుంచి రిలీఫ్ టీమ్స్‌ను, భారీ క్రేన్‌లను పంపినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. జిల్లా ఎస్‌పీ, స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసీ అధికారులు ఘటనాస్థలం దగ్గర సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది.