హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరు నగర శివార్లలోని నల్లపాడువద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమవ్వాల్సిన ఈ దీక్ష పదిగంటలు ఆలస్యంగా మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో ప్రారంభమయింది.
ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌నుంచి విజయవాడకు జగన్ విమానంలో బయలుదేరాల్సి ఉండగా, ఆయన విమానాశ్రయానికి ఆలస్యంగా వెళ్ళటంతో ఫ్లైట్ అందుకోలేకపోయారు. దానితో ఆయన రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరారు. 12 గంటల ప్రాంతంలో విజయవాడ చేరుకున్న జగన్ కనకదుర్గ ఆలయానికి వెళ్ళారు. అమ్మవారిని సందర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన వెంట కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. అక్కడనుంచి గుంటూరు దీక్షాస్థలికి బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటలకు దీక్షాస్థలికి చేరుకున్నారు. భారీ జనసందోహంతో కిక్కిరిసిపోయిన సభాప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రత్యేకహోదాకోసం ఇప్పటికే ప్రాణాలర్పించిన వారి ఫోటోలకుకూడా పూలమాలలు వేసి ప్రజలకు అభివాదం చేశారు. మధ్యాహ్నం 2.25 గంటలకు దీక్ష ప్రారంభించారు.
పార్టీనేతలు కొందరు మాట్లాడిన తర్వాత జగన్ సభకు విచ్చేసినవారినుద్దేశించి మాట్లాడారు. ప్రత్యేకహోదా వస్తే మన పిల్లలకు ఉద్యోగాలొస్తాయని, అందుకోసం ఎంతవరకైనా పోరాడటానికి తాను సిద్ధమని చెప్పారు. బాబు, కిరణ్ కుమార్ రెడ్డి సోనియాతో కుమ్మక్కై తనపై కేసులు పెట్టారని, అయినా తాను దేవుడిని నమ్ముకున్నానని అయితే ఓటుకు నోటు కేసులో పట్టుబడిన బాబుమాత్రం ఆ కేసుకోసం ప్రధానమంత్రి మోడి కాళ్ళు పట్టుకున్నాడని ఆరోపించారు. చంద్రబాబు పాలన అంతా మోసం, మోసం, మోసం అని అరిచారు. రుణాలన్నీ మాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని, బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల ముందు చెప్పారని, కానీ అవేమీ జరగలేదని జగన్ ఆరోపించారు. ఈ పాలనకు చరమగీతం పలికే రోజులు రావాలన్నారు. ఈ పాలన బంగాళాఖాతంలో కలిసే రోజొస్తుందని చెప్పారు. అందరూ కలిసి పోరాడితే చంద్రబాబే కాదు, ఆయన నాయన మనసుకూడా మారుతందని జగన్ అన్నారు.