ఉత్తరప్రదేశ్ మైనార్టీ సంక్షేమ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆజం ఖాన్ కారణాలు ఏమిటో తెలియదు కానీ ఈ మధ్యన ఆయన చాలా విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. రెండు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయనే స్వయంగా తమ ప్రభుత్వానికి సవాలుగా మారారు ఇప్పుడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దాద్రీలో కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక ముస్లిం యువకుడి హత్యకు తమ సమాజ్ వాదీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉందని ఆయనకు తెలుసు. ఆ సంఘటన వలన తమ ప్రభుత్వమే అప్రదిష్ట పాలవుతోందని తెలుసు. ఈ కేసులో తమ ప్రభుత్వమే నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవలసి ఉందని కూడా తెలుసు. కానీ ఆయన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పటికీ నిందితులపై చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా ఈ సంఘటన గురించి నేరుగా ఐక్యరాజ్యసమితికి పిర్యాదు చేస్తానని హెచ్చరిస్తున్నారు.
ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని ఆయన భావిస్తున్నట్లయితే గవర్నర్ కి పిర్యాదు చేయాలి. ఒకవేళ గవర్నర్ కూడా పట్టించుకోకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టు, మానవ హక్కుల సంఘంలో పిటిషన్ వేయవచ్చును. లేదా కేంద్రప్రభుత్వానికి పిర్యాదు చేయవచ్చును. ఆయన ముందు ఇన్ని అవకాశాలు ఉండగా ఆయన ఐక్యరాజ్యసమితికి పిర్యాదు చేస్తానని హెచ్చరిస్తున్నారు. పైగా దానిని సమర్ధించుకొంటూ “ఇది హిందూ-ముస్లింల సమస్యగా కాకుండా దానిలో తపొప్పుల గురించి మాత్రమే నేను చూస్తున్నాను. ఐక్యరాజ్యసమితిలో భారత్ కూడా సభ్యురాలే. కనుక ఈ విషయం గురించి ఆ వేదిక మీద మాట్లాడుతానని చెప్పగానే అందరూ ఎందుకు అంత వ్యతిరేకిస్తున్నారో అర్ధం కావడం లేదు. నన్ను చంపుతామని నిత్యం నాకు అనేక బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. కానీ అటువంటి బెదిరింపులకి నేను భయపడేది లేదు. ఆ నిస్సహాయ కుటుంబానికి న్యాయం జరిగే వరకు నేను వెనుదిరిగే ప్రశ్నే లేదు. ఇదొక్కటే కాదు కొన్ని నెలల క్రితం బదౌన్ లో జరిగిన అక్క చెల్లెళ్ళ జంట హత్యల గురించి కూడా ఐక్యరాజ్యసమితికి పిర్యాదు చేస్తాను. అప్పుడే మన దేశంలో ఆర్.యస్.యస్. చేస్తున్న అరాచకాలు ప్రపంచానికి తెలిసివస్తాయి,” అని అన్నారు.
ఆయన చెప్పిన మాటలను బట్టి ఆయన మోడీ ప్రభుత్వాన్ని దానికి అండగా నిలబడిన ఆర్.యస్.యస్. లను అంతర్జాతీయ సమాజం ముందు నేరస్తులుగా నిలబెట్టాలని భావిస్తున్నట్లుంది. కానీ అందుకు ఇంతకంటే బలమయిన కారణాలు ఏవో ఉండే ఉంటాయి. అవేమిటో తెలిస్తే ఆయన ఐక్యరాజ్యసమితికి ఎందుకు వెళ్ళాలనుకొంటున్నారో అర్ధం అవుతుంది. భారత్ ని పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితిలో దోషిగా నిరూపించేందుకు ఏవిధంగా ప్రయత్నిస్తోందో ఆజం ఖాన్ కూడా అదే విధంగా ఆలోచిస్తున్నట్లు అర్ధం అవుతోంది. స్వదేశంలో భాదితులకు తగిన న్యాయం చేయడానికి ఇన్ని అవకాశాలు ఉండగా, భారత దేశ అంతర్గత వ్యవహారాన్ని ఐక్యరాజ్యసమితి ముందు పెట్టాలనుకోవడం చూస్తుంటే ఆయన వెనుక దేశ విద్రోహశక్తులున్నాయా? అనే అనుమానం కలుగుతోంది. కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన మాటలను తేలికగా కొట్టి పారేయకుండా ఆయన ఆవిధంగా ఎందుకు మాట్లాడుతున్నారో కనుగొనడం మంచిది. లేకుంటే ఆయన అన్నంత పనీ చేయవచ్చును.