నితీష్ కుమార్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే బీహార్ ఎన్నికల సమరంలో ఆయన గెలుపు అనుమానమే అనే సంకేతాలు రోజు రోజుకూ బలపడుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల అంచనాలు, సర్వేల ఫలితాలూ ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. బీజేపీ జోరుమీదుంది. ప్రధాని నరేంద్ర మోడీయే ప్రచార సారథిగా దూకుడుగా ముందుకు పోతోంది. ఆ పార్టీ బలం క్రమంగా పెరుగుతోంది. జంగల్ రాజ్ నినాదం ప్రజలను ఆలోచింప చేస్తోంది. లాలు, నితీష్ దోస్తీ హిట్ కావడానికి బదులు ఫ్లాప్ అవుతుందని కమలనాథులు గట్టి ధీమాతో ఉన్నారు.
బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం చారిత్రక తప్పిదమని ముఖ్యమంత్రి నితీష్ కు నిరుడు లోక్ సభ ఎన్నికల్లో తెలిసింది. లాలు ప్రసాద్ యాదవ్ తో చేతులు కలిపి మరో ఘోర తప్పిదం చేశారు. బీహార్ రాజకీయాల్లో లాలుకు తనదైక కరిష్మా ఉన్నమాట వాస్తవమే. అయితే, 2005లో లాలు కుటుంబ పాలన జంగల్ రాజ్ అనే నినాదాన్ని మొదలుపెట్టి దండయాత్ర చేసిందే నితీష్ కుమార్. అప్పట్లో ఆయన బీజేపీతో కలిసి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 2010లోనూ కమలనాథులతో కలిసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు బీజేపీ వారు జంగల్ రాజ్ నినాదం అందుకుంటే నితీష్ ఉలిక్కి పడుతున్నారు. లాలుతో దోస్తీ కొంప ముంచుతుందేమో అనే భయం వెంటాడుతున్నా, వేరే మార్గం లేకపోయింది.
ఎన్నికల సర్వేల్లోనూ అంచనాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. అయితే నితీష్ కు షాకిచ్చే విషయం ఏమిటంటే, ఎం-వై ఓటు బ్యాంకుకు కూడా బీజేపీ గండికొట్టే అవకాశం ఉండటం. లాలు, నితీష్ లు ముస్లిం, యాదవ ఓటు బ్యాంకుపై గంపెడాశలు పెట్టుకున్నారు. తాజాగా జీ న్యూస్ జరిపిన సర్వేలో 50 శాతం యాదవ ఓట్లు అధికార మహా కూటమికి వస్తాయని, 43 శాతం ఓట్లు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ఖాతాలో జమవుతాయని తేలింది. మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే, దాదాపు 36 శాతం మంది ముస్లింలు ఎన్డీయేకు ఓటు వేసే అవకాశం ఉందట. ఇదే ఇప్పుడు నితీష్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒకవేళ నితీష్ ఇప్పుడు బీజేపీకి మిత్రుడై ఉంటే గెలుపు నల్లేరు మీద నడకలా ఉండేది. మరోసారి సీఎం పదవి సునాయాసంగా లభించేది.
పరిస్థితి చేయి దాటిపోయిందని జేడీయూ నేతలకు అర్థమవుతోంది. కానీ ఏం చేయలేని నిస్సహాయ స్థితి. అందుకే ప్రధాని మోడీపై ఆరోపణల జోరు పెంచుతున్నారు. యూపీ లోని దాద్రీలో గోవధ చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటనకు సంబంధించి బీజేపీపై విమర్శలు చేస్తే అది దానికే ప్లస్ పాయింట్ అవుతుందేమో అనే అనుమానం నితీష్ ను వెంటాడుతోంది. అయినా విమర్శలు చేయక తప్పని పరిస్థితి. మొత్తం మీద పరిస్థితి తమకు అనుకూలంగా లేదనే సంకేతాలు నితీష్ శిబిరంలో కలకలం రేపుతున్నాయి.
చివరకు పరిశీలకుల విశ్లేషణలు, సర్వేల అంచనాలు నిజమవుతాయా లేక అనూహ్య ఫలితాలు వస్తాయా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.