కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ మధ్య రైతుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. రైతు బాంధవుడిగా గొప్పలు చెప్పుకొంటున్నారు. మరోవైపు, ఆయన సభ కోసం కాంగ్రెస్ నాయకులు రైతుల పంటలను నాశనం చేసేశారు. వచ్చే శనివారం నాడు రాహుల్ గాంధీ కర్ణాటక వెళ్తారు. బెంగళూరు శివార్లలో సభలో ప్రసంగిస్తారు. దాని కోసం నాలుగు ఎకరాల పొలంలో పంటను నాశనం చేసేశారు. 15 రోజుల్లో కొత్తకు వచ్చే జొన్న పంటను నాశనం చేసి చదును చేసి సభ కోసం రెడీగా ఉంచారు.
మరో రైతు పంట పొలాన్ని చదును చేసి సభా వేదిక ఏర్పాటు చేస్తున్నారు. వీరిద్దరూ బక్క రైతులే. ఈ విషయాన్ని మొదట ఎన్.డి.టి.వి. ఇంగ్లిష్ న్యూస్ చానల్ బయటపెట్టింది. ఆ తర్వాత పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. దీనిపై ప్రముఖ వ్యాస రచయిత రామచంద్ర గుహ స్పందించారు. రాహుల్ గాంధీ ఇలా వచ్చి అలా వెళ్లడానికి రైతుల పంటను నాశనం చేయడం దారుణమని ట్విటర్ లో పోస్ట్ చేశారు.
రాహుల్ సభకోసం కోసం పంటను నాశనం అతి క్రూరమైన విషయమని బీజేపీ నాయకుడు ప్రకాష్ విమర్శించారు. ఏపుగా పెరిగిన జొన్న పంట 15 రోజుల్లో కోతకు వచ్చేది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇది దుమారం రేపింది.