క్రీష్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డి, హిందూ స్వాములను కలవడం, పుష్కర స్నానాలు చేసి పిండ ప్రదానాలు చేయడం, తన దీక్షలకు ముందు భూమి పూజలు చేయించడం, గుళ్ళూ గోపురాలకు వెళ్లి పూజలు చేయడం చూస్తుంటే ఆయన హిందువులలో ఒక్కో కులానికి గ్యాలం వేస్తూ కూర్చోవడం కంటే అందరికీ కలిపి ఒకేసారి వలేసేయాలని తాతపత్రయ పడుతున్నట్లుంది. గుంటూరులో నిన్న దీక్ష మొదలుపెట్టె ముందు జగన్మోహన్ రెడ్డి విజయవాడలో కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లి పూజలు చేసారు. మంచిదే. కానీ ఆయన అనుచరులు ఆ గుళ్ళో జై జగన్ అంటూ నినాదాలు చేసినందుకు భక్తులు చాలా ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదివరకొకసారి జగన్మోహన్ రెడ్డి తిరుమల స్వామివారిని సందర్శించుకోవడానికి వెళ్లినప్పుడు ఆయన చెప్పులతో గుళ్ళో ప్రవేశించబోయారు. గుళ్ళోకి చెప్పులు ధరించి వెళ్ళకూడదనే చిన్న విషయం జగన్ కి తెలియదనుకోవాలా…లేక నిర్లక్ష్యం అనుకోవాలో తెలియదు కానీ హిందువులను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంలో అప్పుడు కూడా వారి ఆగ్రహానికి గురయ్యారు. హిందూ రాజకీయ నేతలు ముస్లిం టోపీలు పెట్టుకొని నమాజు చేస్తున్నట్లు ఫోజులు పెట్టినంత మాత్రాన్న ముస్లింల ఓట్లు ఎలాగ రాలవో అలాగే జగన్మోహన్ రెడ్డి హిందూ సంప్రదాయాలు పాటించి, గుళ్ళు గోపురాలకు వెళ్లి పూజలు చేసినంత మాత్రాన్న హిందువులు పడిపోరని గ్రహించినట్లు లేదు. అందరినీ ఒకేసారి పడేసే ప్రయత్నం చేయడం కంటే, మిగిలిన రాజకీయ నేతల్లాగే ప్రజలని కులాలవారిగా హ్యాండిల్ చేయడమే మంచిది. అదే బాగా వర్కవుట్ అవుతుందని మన నేతలు అనేకసార్లు నిరూపించి చూపారు కూడా.