హైదరాబాద్: కాశ్మీర్ శాసనసభ ఇవాళ రణరంగాన్ని తలపించింది. బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముష్ఠియుద్ధానికి పాల్పడ్డారు. నిన్న గొడ్డుమాంసంతో పార్టీ ఇచ్చిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఇంజనీర్ రషీద్‌పై బీజేపీ ఎమ్మెల్యేలు దాడికి పాల్పడ్డారు. రషీద్‌కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యులు ఒకవైపు, బీజేపీ ఎమ్మెల్యేలు మరోవైపు తలపడ్డారు. పరస్పరం చొక్కాలు పట్టుకున్నారు.
కాశ్మీర్లో గొడ్డుమాంసం అమ్మకాన్ని రెండునెలలపాటు నిలిపేస్తూ ఆ రాష్ట్ర హైకోర్ట్ విధించిన నిషేధంపై సుప్రీం కోర్ట్ సోమవారం స్టే విధించింది. హైకోర్ట్ ఈ నిషేధాన్ని విధించటానికి నిరసనగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రషీద్ నిన్న ఎమ్మెల్యే హాస్టల్ లాన్స్‌లో ఎమ్మెల్యేలకు గొడ్డుమాంసంతో చేసిన వంటకాలతో డిన్నర్ పార్టీ ఇచ్చారు. ఇది ఎవరినీ నొప్పించటానికి తాను చేయటంలేదని, ఎవరైనా తమకు ఇష్టమొచ్చిన దానిని తినకుండా ఏ కోర్టూ, ఏ చట్ట సభా అడ్డుకోకూడదనే సందేశం ఇవ్వటానికి పార్టీ ఇచ్చానని చెప్పారు. గొడ్డుమాంసంపై నిషేధం అంశంపై ఇవాళ శాసనసభలో గొడవ జరిగినపుడు రషీద్‌పై బీజేపీ సభ్యులు దాడిచేశారు. మొత్తంమీద గొడ్డుమాంసం దేశంలో కలకలం సృష్టిస్తోంది.