హైదరాబాద్: శుక్రవారం విడుదల కాబోతున్న ప్రతిష్ఠాత్మక చారిత్రక చిత్రం ‘రుద్రమదేవి’పై వినోదపు పన్నును రద్దుచేయటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. ఆ చిత్ర దర్శక-నిర్మాత గుణశేఖర్ ఇవాళ దిల్ రాజుతో కలిసి క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ను కలిశారు. రుద్రమదేవి చిత్రాన్ని చూడాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వినోదపు పన్ను మినహాయింపుపైకూడా ఆయనను అభ్యర్థించారు. దానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. కాకతీయుల చరిత్రను ఆవిష్కరిస్తూ మంచి చిత్రాన్ని తీశారని గుణశేఖర్ బృందాన్ని అభినందించారు.
కాకతీయ రాజవంశానికి చెందిన మహారాణి రుద్రమదేవి కథ ఆధారంగా తీసిన ఈ చిత్రంలో అనుష్క టైటిల్ పాత్ర, గోన గన్నారెడ్డి పాత్రను అల్లు అర్జున్, చాళుక్య వీరభద్రుని పాత్రను రాణా, గణపతిదేవుని పాత్రను కృష్ణంరాజు, శివదేవయ్య పాత్రను ప్రకాష్ రాజ్ పోషించిన సంగతి తెలిసిందే. దేశంలోనే తొలిసారిగా స్టీరియో స్కోపిక్ త్రీడీ విధానంలో గుణశేఖర్ ఈ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించారు. ఎంతోకాలంగా నిర్మాణదశలోనే ఉండిపోయిన ఈ చిత్రానికి మొత్తంమీద రిలీజ్ అయ్యే సమయానికి బాగానే క్రేజ్ వచ్చింది. మరోవైపు దర్శకుడు రాజమౌళికూడా ఈ చిత్రం ట్రైలర్ చాలా బాగుందని, 3 డీ ఎఫెక్ట్స్ బాగా వచ్చాయని తనకు తెలిసిందని ట్విట్టర్లో వ్యాఖ్యలు చేయటంతో క్రేజ్ మరింత పెరిగింది. ఈ వీకెండ్ వరకు రిలీజ్ కానున్న ధియేటర్లన్నింటిలో షోలు ఫుల్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని భావిస్తున్నారు. దానికితోడు దసరా సెలవులు వస్తుండటం ఈ చిత్రానికి మరో కలిసొచ్చే అంశం. మొత్తంమీద గుణశేఖర్ సర్వశక్తులూ ఒడ్డి చేసిన ఈ ప్రయత్నం ఏమవుతుందో మరికొద్ది గంటల్లో తేలనుంది.