హైదరాబాద్: ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. విపక్షాలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయని, ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్ళాలని ఆదేశించారు. తెలంగాణ భవన్లో ఇవాళ జరిగిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. రైతులను ఆదుకోవటానికి ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు తెలియజేయాలని, ప్రజలే తమకు బాస్‌లు అని చెప్పారు. దసరా పండగలోపే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామని తెలిపారు. ఆశావహుల జాబితా ఇవ్వాలని ఆదేశించారు. 17 కార్పొరేషన్ పోస్టుల భర్తీ త్వరలోనే చేస్తామని, ఇందులో నాలుగు లేదా ఐదింటిని ఎమ్మెల్యేలకు ఇస్తామని చెప్పారు. కార్పొరేషన్ పదవులు ఎవరికి ఇవ్వాలనేది కేంద్ర పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. దీనికోసం హరీష్ రావు, పోచారం తదితరులతో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జనవరిలో ఉండొచ్చని తెలిపారు. వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు 67 శాతమని, నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో అవకాశాలు 52 శాతమని చెప్పారు. దసరానుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకం ప్రారంభిస్తామని తెలిపారు. మిషన్ కాకతీయలో బాగా పనిచేస్తున్న నియోజకవర్గాలకు అదనంగా పదిశాతం నిధులు ఇస్తామని చెప్పారు.