హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్లోని దాద్రిలో బీఫ్(గొడ్డుమాంసం) తిన్నందుకు ఒక ముస్లిమ్ను చంపిన సంచలన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడి నోరు మెదపకపోవటంపై గత కొద్దిరోజులుగా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని ఎట్టకేలకు ఇవాళ ఆ ఘటనపై స్పందించారు. ఇవాళ బీహార్లో ఒక ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పరస్పరం కలహించుకోవటం కాకుండా దేశమంతా ఒక్కటిగా ఉండాలని పిలుపునిచ్చారు. దారిద్ర్యంపై పోరాటంలో హిందువులూ, ముస్లిమ్లూ కలిసి పనిచేయాలని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం, సహనం అనే విలువలు భారత దేశ మనుగడకు కీలకమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న చెప్పిన మాటలు అనుసరణీయమని మోడి అభిప్రాయపడ్డారు. విద్వేషపూరిత ప్రసంగాలను ఆలకించొద్దని అభ్యర్థించారు. రాజకీయ ప్రయోజనాలకోసం కొందరు ఆటలాడుతున్నారని మండిపడ్డారు. దేశమంతా ఒక్కటిగా నిలవాలని అన్నారు. సామరస్యం, సౌభ్రాతృత్వంమాత్రమే దేశాన్ని ముందుకు తీసుకెళతాయని చెప్పారు.
మరోవైపు దాద్రి ఘటనపై దేశవ్యాప్తంగా ఇంత కలకలం రేగుతున్నా ప్రధాని తన స్పందనలో విచారం వ్యక్తం చేయటంగానీ, ఆ ఘటనను ఖండించటంగానీ చేయకుండా కేవలం ప్రశాంతంగా ఉండాలని మాత్రమే కోరటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దాద్రి ఘటనపై మోడి మౌనానికి నిరసనగా జవహర్లాల్ నెహ్రూ మేనకోడలు, ప్రముఖ రచయిత్రి, జర్నలిస్ట్ నయనతార సెహగల్ తనకు వచ్చిన సాహిత్య అకాడమీ పురస్కారాన్ని వెనక్కు ఇస్తానని నిన్న ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం విదితమే.