ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న కాలమిది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలను కూడా మహిళా పైలట్లు నడపబోతున్నారు. ఇప్పటి వరకు హెలికాప్టర్లు మాత్రమే నడుపుతున్న వీరికి ఫైటర్ జెట్ నడిపే అవకాశం కల్పిస్తామని ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా ప్రకటించారు. దీంతో మహిళా పైలట్లు హర్షధ్వానాలు చేశారు. ప్రస్తుతం వాయుసేనలో 100 మంది మహిళా పైలట్లున్నారు. వీరంతా రవాణా, హెలికాప్టర్ పైలట్లుగా సేవలు అందిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ తో పాటు నేవీ, ఆర్మీలోనూ మహిళా సైనికులు, అధికారులున్నా, వారిని పరిపాలన పరమైన పనులకే పరిమితం చేశారు. యుద్ధ రంగానికి మహిళా సైనికులను పంపడానికి రక్షణ శాఖ అనుమతినివ్వలేదు.
యుద్ధం చేయాలంటే శత్రు భూభాగంలోకి వెళ్లి దాడి చేయాలి. అనుకోకుండా శత్రు సైనికులకు మన మహిళా సైనికులు చిక్కితే వీరి పట్ల ఎలా ప్రవర్తిస్తారో అనే అనుమానంతోనే వీరిని పరిపాలనపనులకు పరిమితం చేస్తున్నట్టు తెలుస్తోంది. మహిళల ఆత్మగౌరవం కోణంలోనే సైన్యానికి సంబంధించిన కమిటీలన్నీ వీరిని యుద్ధ రంగానికి పంపవద్దని సిఫార్సు చేశాయి. అయితే ఇప్పుడు యుద్ధ విమానాలను నడిపే అవకాశం ఇవ్వాలని వాయుసేన నిర్ణయించడం విశేషం. అయితే సరిహద్దులకు సమీపంలోనే దాడులు చేసేలా వీరి సేవలను ఉపయోగించవచ్చు. మరీ శత్రుదేశాల నగరాలపైకి వెళ్లి దాడులు చేసే బాధ్యతలను పురుష పైలట్లకే అప్పగించే అవకాశం ఉంది.
భారతీయ వాయుసేన 83వ వార్షికోత్సవం సందర్భగా ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ ఎయిర్ బేస్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా, పురుష పైలట్ల విన్యాసాలు అబ్బుర పరిచాయి. ఆకాశంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. క్రికెటర్ సచిన్ టెండుల్కర్ పైలట్ యూనిఫారంలో ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
మొత్తానికి ఆడది అబల కాదు సబల అని ఎప్పుడో రుజువైంది. ఇప్పుడు వాయుసేన యుద్ధ విమానాలను మహిళా పైలట్లు నడిపే రోజులు రాబోతున్నాయి. అయితే ఇందుకు కొంత సమయం పడుతుందట.