హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా కానున్నారని తెలుస్తోంది. ఆయనకు సన్నిహితులైన పారిశ్రామికవేత్త మైహోమ్ రామేశ్వరరావు, ఆధ్యాత్మిక గురువు చిన జియ్యర్ స్వామిలుకూడా ఛాన్సలర్లు కానున్నారని ఇవాళ ఒక ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ఇచ్చింది.
ఇప్పటివరకు రాష్ట్రంలో ఉండే అన్నియూనివర్సిటీలకు గవర్నరే ఛాన్సలర్‌గా వ్యవహరిస్తుండేవారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గవర్నర్‌ను ఆ పదవినుంచి తొలగించటమేకాక ప్రతి యూనివర్సిటీకి విడివిడిగా ఛాన్సలర్లను నియమించే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తూ యూనివర్సిటీల చట్టాన్ని సవరించింది. ఈ పదవుల భర్తీ ప్రక్రియకు విధివిధానాలను ఆ సవరించిన చట్టంలో ప్రభుత్వం పేర్కొనకపోయినప్పటికీ, సుప్రసిద్ధ విద్యావేత్తలు, ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులను నియమించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఛాన్సలర్లు, వైస్ ఛాన్సలర్లను నియమించటంలో అంతిమ నిర్ణయం ముఖ్యమంత్రిదే అవుతుంది.
ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు రెండింటిలో ఉస్మానియా ఒక్కదానికే ఛాన్సలర్‌గా వ్యవహరించటమా, రెండింటికీ వ్యవహరించటమా అనేదానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సందిగ్ధతలో ఉన్నట్లు తెలుస్తోంది. జేఎన్టీయూ-హైదరాబాద్ యూనివర్సిటీకి రామేశ్వరరావు, టెక్సాస్ యూనివర్సిటీలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న జేఎన్ రెడ్డి పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. తెలుగు విశ్వవిద్యాలయానికి చినజియ్యర్ స్వామిని ఛాన్సలర్‌గా నియమించే అవకాశం ఉంది.