హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఆరోగ్య రహస్యాన్ని బయటపెట్టారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గుడ్డును తప్పనిసరిగా తింటానని, అందువల్లే ఉత్సాహంగా, ఆనందంగా ఉండగలుగుతున్నానని వెల్లడించారు. ప్రపంచ గుడ్డు దినోత్సవంలో భాగంగా ఇవాళ విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు. వ్యవసాయంలో నష్టాలు పెరుగుతున్నవేళ రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని సూచించారు. కోళ్ళపరిశ్రమ, పశువుల పెంపకంవైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ పరిశ్రమ దేశంలోనే రెండోస్థానంలో ఉందని, దీనిని అగ్రస్థానానికి చేరుస్తామని అన్నారు. గుడ్లతో తయారయ్యే వంటకాలను మరింతగా ప్రోత్సహిస్తామని, గుడ్డు ఉత్పత్తులపై పరిశోధనలు చేసేవారికి ప్రభుత్వంనుంచి ప్రోత్సాహకాలు, సహకారాన్ని అందిస్తామని వివరించారు. ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయని, అన్నం తినేవారిసంఖ్య తగ్గిపోతోందని, డబ్బున్నవారు పళ్ళు, చికెన్, మటన్, ఫిష్ తింటున్నారని చెప్పారు. గుడ్డు తినటంవలన రెండు ప్రయోజనాలు ఉన్నాయని, ఆర్థికవ్యవస్థకు ఊతమివ్వటంతోపాటు ఆరోగ్యంకూడా మెరుగుపడుతుందని అన్నారు. విద్యార్థిదశలో వేయి కోళ్ళతో తాను పౌల్ట్రీ ఫారం నడిపానని చెప్పారు.