హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సుమారు 40 లక్షలమందిని(32 లక్షలమంది కస్టమర్లు, 8 లక్షలమంది ఏజెంట్లు) ముంచేసి, పలువురు ఆత్మహత్య చేసుకోవటానికికూడా కారణమైన అగ్రిగోల్డ్ సంస్థ వ్యవహారంలో హైకోర్ట్ ఇవాళ తుదితీర్పు వెలువరించింది. సంస్థ ఆస్తుల అమ్మకంకోసం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని కోర్ట్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జడ్జితోపాటు ఏపీ, తెలంగాణనుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. ముందు ప్రధానమైన 14 ఆస్తులను, రెండో విడతలో 5 ఆస్తులను విక్రయించాలని, ఆస్తుల వివరాలు ఈ నెల 26లోగా సమర్పించాలని ఆదేశించింది. ఆస్తుల విక్రయం ఈ-ఆక్షన్ విధానంలో జరగాలని, లావాదేవీలకోసం హైకోర్ట్ రిజిస్ట్రార్ పేరుతో ఎకౌంట్ తెరిచి దానిలో విక్రయించిన సొమ్మును వేయాలని సూచించింది. కోర్ట్ తీర్పుపై అగ్రిగోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ నాటికి చెల్లింపులు ప్రారంభమవుతాయని బాధితులు ఆశిస్తున్నారు.
ఏపీ, తెలంగాణల్లో అగ్రిగోల్డ్‌కు ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్, ఇతర ప్రాంతాలలో 176 ఎకరాల స్థలం, విజయవాడలో 172 ఎకరాల స్థలం ఉంది. సంస్థకు చెందిన 300 ఆస్తుల జాబితాను హైకోర్ట్‌కు ఇప్పటికే సమర్పించటం జరిగింది. ఆస్తుల విక్రయం విషయంలో కమిటీకి సహకరించాలని, ఆస్తుల విషయంలో ఏదైనా తేడా వచ్చినా, ఇన్సైడ్ ట్రేడింగ్ చేసినా అగ్రిగోల్డ్ యాజమాన్యంపై కేసులు పెడతామని హైకోర్ట్ హెచ్చరించింది. రిటైర్డ్ జడ్జి పేరును ఈ నెల 12న ప్రకటించనున్నారు.