హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు(ఆశా) ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శాపనార్థాలు పెడుతున్నారు. కనీస వేతనం రు.15 వేలు చేయటం, పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించటం మొదలైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆశావర్కర్లు ఇవాళ ఇందిరా పార్క్ వద్ద భారీ ర్యాలీ తలపెట్టారు. ఈ సభలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలలనుంచి ఆశా వర్కర్లు చలో హైదరాబాద్ పేరుతో తరలివస్తుండగా వారి నిరసనను భగ్నం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం వారిపై ఉక్కుపాదం మోపింది. ఈ ర్యాలీకి వస్తున్న వందలమందిని ఎక్కడికక్కడ నిన్నరాత్రే అరెస్ట్ చేసి దగ్గరలోని ఫంక్షన్ హాల్స్‌లో నిర్బంధించారు. రైల్వేస్టేషన్లు, బస్ స్టాండ్లు, చెక్ పోస్టులవద్ద ఆశా వర్కర్లను అడ్డుకున్నారు. మరోవైపు ఎలాగోలా జిల్లాలనుంచి హైదరాబాద్ చేరుకున్నవారిని సికింద్రాబాద్ స్టేషన్ లోనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇవాళ ఉదయం అసెంబ్లీ ముట్టడికి, గన్ పార్క్ వద్దకు వెళ్ళేందుకు యత్నించిన ఆశా వర్కర్లను పోలీసులు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద అడ్డుకున్నారు. ప్రభుత్వం నిరంకుశ ధోరణితో తమకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వటంలేదని ఆందోళనకారులు మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రిని తీవ్ర దుర్భాషలాడారు. తాము పిల్లలను ఇంట్లో వదిలిపెట్టి ఈ ర్యాలీకి బయలుదేరామని పోలీసులు తమను అరెస్ట్ చేసి కనీసం ఆహారం, నీళ్ళు ఇవ్వకుండా బాధిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు తాము ఆడబిడ్డలం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే ధర్నాలు, ఆందోళనలు ఉండవని నాడు అన్న కేసీఆర్, ఇప్పుడు తాము ఆందోళన చేస్తుంటేే ఇంట్లో కూర్చుని తమను అరెస్ట్లులు చేయిస్తున్నాడని మండిపడ్డారు.