హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఏకేస్తున్నారు. బీజేపీ సీనియర్ నేతలు కావూరి సాంబశివరావు, సోము వీర్రాజు, పురందరేశ్వరి గత కొద్దిరోజులుగా టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నివిధాలా అండదండలు అందిస్తుండగా వీరు విమర్శలు చేయటం, అందులోనూ సోము వీర్రాజు అమిత్ షా ఆశీస్సులతో బాబును నేరుగా విమర్శించటం చర్చనీయాంశమయింది.
పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిన్న ఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టిసీమ పోలవరం అంతర్భాగమని చెప్పటం సబబు కాదని అన్నారు. ఏపీ ప్రభుత్వం పోలవరం పనులకు ఏ మాత్రం ప్రాధాన్యమివ్వటంలేదని ఆరోపించారు. పనులు చేయకుండా ఆ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు రు.1,900 కోట్లు మాత్రం వాడుకుంటోందని నిన్న అన్నారు. దీనిపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ఫిర్యాదు చేశానని, కేంద్ర నీటిపారుదలశాఖమంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారని తెలిపారు. ఏపీలోని ఏడు జిల్లాల అభివృద్ధికి రు.350 కోట్లు కేంద్రం మంజూరు చేయగా, వాటిని ఉపయోగించకుండా బ్యాంకుల్లో పెట్టి వడ్డీని వాడుకుంటున్నారని వీర్రాజు ఆరోపించారు.
మరోవైపు, పురందేశ్వరికూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలవరం విషయంలో బిల్లులు చూపిస్తే కేంద్రం నిధులు ఇస్తుందని, బిల్లులు ఇవ్వకుండా నిధులు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా, ప్యాకేజి అనేవి పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం ఏపీకి గత సంవత్సర కాలంలో ఇన్ని నిధులు ఇవ్వటం ఇంతకు ముందెన్నడూ జరగలేదని అన్నారు.
ఇక కావూరి సాంబశివరావు మూడురోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో బీజేపీ బలపడటం టీడీపీకి ఇష్టంలేదని వ్యాఖ్యానించారు. కేంద్రం ఇచ్చే పథకాలవలన టీడీపీ కార్యకర్తలు తప్ప బీజేపీ కార్యకర్తలు లబ్ది పొందటంలేదని అన్నారు.