గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ (71) ఈరోజు ముంబై లీలావతి ఆసుపత్రిలో కన్ను మూశారు. పుట్టుకతో గుడ్డివాడయిన ఆయన 1944, ఫిబ్రవరి 28న ఆలిఘర్ లో జన్మించారు. మొత్తం ఎనిమిది సంతానంలో ఆయన మూడవవారు. బాల్యం నుండే సంగీతంపై అభిరుచి పెంచుకొన్న రవీంద్ర జైన్ జైనుల భజన పాటలు పాడేవారు. ఆయనలో సంగీత ప్రతిభ గుర్తించిన ఆయన తల్లి తండ్రులు ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ పండిట్ జి.యల్. జైన్ వద్ద చేర్పించారు.
ఆవిధంగా మొదలయిన రవీంద్ర జైన్ సంగీత యాత్ర 1960లో సినీ పరిశ్రమవైపు మళ్ళింది. ఆయన సంగీత దర్శకత్వం వహించిన చోర్ మచాయే షోర్, గీత్ గాతా చల్, చిత్ చోర్, ఆంకియోం కె జహారోకోన్ సే, సౌదాగర్, రాం తేరీ గంగా మైలీ వంటి ఆణిముత్యాలనదగ్గ అనేక సినిమాలు చేసారు. ఆయన వివిధ బాషలలో కలిపి సుమారు 175 సినిమాలకు పైగా సంగీతం అందించారు. తెలుగులో దాసి, స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలకి కూడా సంగీతం అందించారు. ప్రముఖ గాయకుడు జేసుదాసును ఆయనే బాలీవుడ్ కి పరిచయం చేసారు. ఆయన ఉర్దూ గజల్స్, జైన్ భజన పాటలకు సంగీతం అందించారు. సినిమాలలోనే కాకుండా సుమారు మూడు దశాబ్దాల పాటు రామాయణ్, లవ్ కుష్, నుపూర్, విమెన్ ఆఫ్ ఇండియా-ఊర్వశి వంటి అనేక టీవీ సీరియల్స్ కి సంగీతం అందించారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఐదు ఫిలిం ఫేర్ అవార్డులు, పద్మశ్రీ అవార్డు అందుకొన్నారు. రవీంద్ర జైన్ పుట్టు గుడ్డి వాడని తెలిసినప్పటికీ ప్రముఖ కవయిత్రి దివ్యా జైన్ ఆయనను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకొన్నారు. ఆ దంపతులకు ఆయుష్మాన్ జైన్ అనే ఒక కుమారుడు ఉన్నాడు.