హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ రాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ శాసనసభాపక్షనేత జానారెడ్డి నిప్పులు చెరిగారు. కేటీఆర్ ఇటీవల ఆత్మకూరు మండలంలో పర్యటిస్తూ, జానారెడ్డి ఏదైనా జానెడు పని చేస్తడా అని విమర్శించటంపై జానా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న వరంగల్ జిల్లా నర్సంపేట బహిరంగ సభలో మాట్లాడుతూ, కేటీఆర్ మాటలపై రక్తం కుతకుతలాడుతోందన్నారు. అసలు కేటీఆర్ బెత్తెడు పనికూడా చేస్తాడని ప్రజలకు నమ్మకంలేదని చెప్పారు. బెత్తెడు పనికూడా చేయలేనోడికి జానెడు పనిగురించి మాట్లాడే హక్కులేదని అన్నారు. బారెడు మాటలు చెప్పుకుంటూ ఈ 14 ఏళ్ళు తిరిగి, అధికారంలోకి వచ్చిన తర్వాత బెత్తెడుకూడా చేయలేకపోయారన్నది అడుగడుగునా రుజువవుతోందని విమర్శించారు. జానారెడ్డి అంటే జనం మనిషని అందరికీ తెలుసని చెప్పారు. మండల వ్యవస్థను తెచ్చింది, అంజుమన్ పేరుతో రు.2 వేలకోట్ల రుణమాఫీ చేసింది, విజయభాస్కరరెడ్డి హయాంలో పెరిగిన ఎరువులు తగ్గించింది, 30 ఏళ్ళ క్రితం నర్సంపేటలో ఫారెస్ట్ దొంగలను పట్టుకునేందుకు అడవుల వెంబడి తిరిగింది జానారెడ్డేనని అన్నారు. తానేంటే కేటీఆర్‌కు తెలియదని, కేటీఆర్ అయ్యకు తెలుసని చెప్పారు. చేసిన పనులు ప్రచారం చేసుకోవటం తనకు ఇష్టం ఉండదని జానారెడ్డి అన్నారు.
మరోవైపు ఇవాళ ఉదయం ప్రారంభమైన తెలంగాణ బంద్‌లో జానారెడ్డి పాల్గొనకపోవటం చర్చనీయాంశమయింది. జానాపై కాంగ్రెస్ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే అనారోగ్యం కారణంగా ఆలస్యంగా వచ్చానని జానా చెప్పారు. బంద్ సందర్భంగా అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేతలను విడుదల చేయాలని ఆయన కమిషనర్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేశారు.