హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తుండగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇవాళ సంచలన ఉత్తర్వులు వెలువరించింది. తుళ్ళూరు పరిధిలో రాజధాని ప్రాంతంలో జరుగుతున్న భూమి చదును పనులను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. పర్యావరణ అనుమతులు మంజూరయ్యేవరకు పనులు చేపట్టకూడదని ఆదేశించింది. తోటలను తొలగించకూడదని సూచించింది. తోటలను తొలగిస్తున్నట్లు చూపిస్తున్న సాక్ష్యాలను పిటిషనర్ ట్రిబ్యునల్‌కు సమర్పించారు. ముంపు, తడి ప్రాంతాలను గుర్తించి నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలుపుకోలేదని అభిప్రాయపడింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 5 తేదీకి వాయిదా వేసింది.
రాజధాని అమరావతిని సారవంతమైన, పంటలు పండే భూమిపై, అదికూడా వరదలు సంభవించటానికి అవకాశమున్న ప్రాంతంలో నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ పి.శ్రీమన్నారాయణ అనే వ్యక్తి సుప్రీమ్ కోర్ట్‌లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేశారు. సుప్రీమ్ కోర్ట్ ఈ కేసును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు బదిలీ చేసింది. ప్రభుత్వం ఇంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అమరావతి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తుండగా ఈ స్టే రావటం సంచలనమే. ప్రభుత్వం ఇప్పుడు దీనిపై ఎలా ముందుకెళుతుందో చూడాలి. సోమవారం స్టేపై అప్పీల్ చేసే అవకాశాలున్నాయి.
శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లపై ఏపీ క్యాబినెట్ సమావేశం ఇవాళ విజయవాడలో జరుగుతుండగానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు వెలువడటం విశేషం. మరోవైపు శంకుస్థాపన కార్యక్రమ ఆహ్వాన పత్రిక ఇవాళ సిద్ధమయింది. ఆ పత్రికను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ మీడియాకు విడుదలచేశారు.