వైకాపా ఎప్పుడూ ఆచితూచి ఎందుకు తప్పులు చేస్తుందో తెలియదు కానీ ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్ష విషయంలోను ఇప్పుడు అదే పొరపాటు చేసినట్లు అనిపిస్తోంది. ఈ దీక్షతో యావత్ ప్రజలలో ఉద్యమాగ్ని రగిలించి తన రాజకీయ శత్రువయిన తెదేపాని, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని అష్ట దిగ్బంధం చేయాలని జగన్ అనుకొన్నారు. కానీ నాలుగు రోజుల దీక్ష తరువాత కూడా రాష్ట్ర ప్రజలలో ఎటువంటి చలనమూ కనబడలేదు. అందుకు కారణం జగన్ దీక్ష కోసం వైకాపా ఎంచుకొన్న తప్పుడు సమయమే. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని శంఖుస్థాపన కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా నభూతో నభవిష్యత్ అనే విధంగా నిర్వహించడానికి సిద్దమవుతున్నదని వైకాపా నేతలకు ముందే తెలుసు. తెలిసీ కూడా సమయం కాని సమయంలో, అనువుగాని చోటులో జగన్మోహన్ రెడ్డిని దీక్షకు కూర్చోబెట్టారు. తత్ఫలితంగానే జగన్ దీక్షకు ఆశించినంతగా ప్రజల నుండి ప్రతిస్పందన కనబడటం లేదు.
ఇంతవరకు రాజధాని వ్యవహారాలతో రాష్ట్ర ప్రజలకి, ప్రతిపక్షాలకి ఎటువంటి సంబంధం లేదన్నట్లు అన్నీ తానై వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అకస్మాత్తుగా తన వ్యూహం మార్చుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో పాలుపంచుకొనే విధంగా ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామాల నుండి గుప్పెడు మట్టిని, చెంబుడు నీళ్ళని తీసుకురమ్మని కోరుతున్నారు. వాటిని రాజధానిలో భద్రపరుద్దామని తద్వారా రాజధానిలో తాము కూడా పాలుపంచుకొన్నట్లు, రాజధాని మన అందరిదీ అనే భావన కలుగుతుందని చంద్రబాబు నాయుడు చెపుతున్నారు. ఆ విధంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలలో సెంటిమెంటును తట్టిలేపే ప్రయత్నం చేస్తునట్లు అర్ధమవుతోంది. అందుకే ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహిద్దామని చెపుతున్నారు. చెప్పడమే కాదు అందుకు అవసరమయిన ఏర్పాట్లు అన్నీ చకచకా చేస్తున్నారు.
అమరావతి శంఖుస్థాపనకి ఏర్పాట్లు, ఆరోజు జరుగబోయే కార్యక్రమాలు, దానికి రాబోతున్న అతిధులు, వారి కోసం ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు వంటి ఆసక్తికరమయిన విషయాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ వారిలో ఒకరకమయిన ఆసక్తిని, ఉత్సాహాన్ని రేకెత్తించడంలో చంద్రబాబు నాయుడు సఫలం అయ్యారనే చెప్పవచ్చును. ప్రజలందరూ అమరావతిలో ఏమి జరుగుతోందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నందున మీడియా కూడా దానికి సంబంధించిన వార్తలనే ప్రసారం చేస్తోంది.
ఆ కారణంగా జగన్ దీక్షను మీడియా కూడా పట్టించుకోవడం మానేసింది. కనుక సాక్షి మీడియా మిగిలిన వార్తలను పక్కనబెట్టి జగన్ దీక్ష, దానికి సంబందించిన వార్తలకే అంకితం అయిపోక తప్పలేదు. కానీ అమరావతి శంఖుస్థాపన గురించి గంటకో ఆసక్తికరమయిన విశేషం, రోజుకో తాజా వార్త వినిపిస్తుంటే సహజంగానే ప్రజలు దానిపైనే ఆసక్తి చూపుతారు తప్ప జగన్ దీక్షా వేదిక నుండి వైకాపా నేతలు పదేపదే ఒకే మాటను తిప్పితిప్పి చెపుతున్న మాటలని కాదు. రాష్ట్రంలో ఎటువంటి హడావుడి లేని సమయంలో జగన్ దీక్షకు కూర్చొని ఉండి ఉంటే యావత్ రాష్ట్ర ప్రజల దృష్టి ఆయనపైనే ఉండేది. అప్పుడు మీడియా కూడా ఆయన దీక్షను హైలైట్ చేసి ఉండేది.
ఈ నిరాహార దీక్షతో ప్రత్యేక హోదాపై జగన్ చేస్తున్న పోరాటం కీలక దశకు చేరుకోందని సాక్షి మీడియా పేర్కొంది. కానీ అమరావతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హడావుడి, ప్రచారం ముందు జగన్ పోరాటమంతా బూడిదలో పోసిన పన్నీరులా వ్యర్ధమయిపోయిందని చెప్పక తప్పదు. అందుకు తెదేపాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కాక ఈ దీక్షకు ఈ ముహూర్తం నిర్ణయించిన వైకాపా వ్యూహకర్తలనే నిందించవలసి ఉంటుంది. ఇటువంటి ఉద్యమాలలో అంతిమంగా నిరవధిక దీక్షలు చేస్తుంటారు. కనుక జగన్ ప్రస్తుతం చేస్తున్న దీక్షతో పోరాటం పతాక స్థాయికి చేరుకొన్నట్లు భావించవలసి ఉంటుంది. సాక్షి మీడియా కూడా జగన్ దీక్షకు కూర్చొనే ముందు అదే ముక్క చెప్పింది. కానీ అదిప్పుడు నిష్ఫలం కావడంతో మళ్ళీ ఇంతకంటే గొప్పగా ప్రభావం చూపగల మరో పోరాటం చేయడం, దానికి ప్రజలను ఆకట్టుకోవడం రెండూ కష్టమే. నేడో రేపో పోలీసులు రంగ ప్రవేశం చేసి జగన్ దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలిస్తారు. అంతటితో ఈ పోరాటం పరిసమాప్తం అవుతుంది. కనుక తరువాత జగన్ తన ఈ ప్రత్యేక పోరాటాన్ని ఏవిధంగా ముందుకు తీసుకుపోతారో వేచి చూడవలసిందే.