హైదరాబాద్: రుద్రమదేవి చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనక అల్లు అర్జున్ కీలకపాత్ర పోషించినట్లు తాజాగా వెలుగులోకొచ్చింది. దర్శక బాహుబలి రాజమౌళి ఈ విషయాన్ని బయటపెట్టారు. రుద్రమదేవి చిత్రాన్ని చూసి స్పందిస్తూ, జక్కన్న ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. రుద్రమదేవికి పన్ను మినహాయింపులో అల్లు అర్జున్ పాత్ర కీలకమని ట్విట్టర్లో పేర్కొన్నారు.
గుణశేఖర్ గురువారం కేసీఆర్‌ను కలవటానికి వెళ్ళినపుడు ఆయన పక్కన అల్లు అర్జున్ మామ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నపుడే, అల్లు అర్జునే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయించి ఉండొచ్చని ఊహాగానాలు సాగాయి(గుణశేఖర్ బృందం కేసీఆర్ ను కలిసిన ఫోటోలలో శేఖర్ రెడ్డి కూడా ఉండటాన్ని గమనించొచ్చు). ఇవాళ రాజమౌళి ట్వీట్‌తో ఆ ఊహాగానాలు రూఢి అయ్యాయి. గుణశేఖర్ బృందానికి అల్లు అర్జున్ తన మామ ద్వారా కేసీఆర్ అపాయింట్మెంట్ ఏర్పాటు చేసినట్లు అర్థమవుతోంది. హైదరాబాద్ శివార్లలో పలు ఇంజనీరింగ్ కళాశాలలు నడుపుతున్న చంద్రశేఖర్ రెడ్డి, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరపున పోటీచేసి టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
మరోవైపు రుద్రమదేవి గురించి స్పందిస్తూ, గుణశేఖర్‌ను, ఆయన బృందాన్ని అభినందించారు. గోనగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్, టైటిల్ రోల్లో అనుష్క అద్భుతమైన నటన ప్రదర్శించారని పేర్కొన్నారు. అల్లు అర్జున్ గన్నారెడ్డి పాత్రను ఒప్పుకుని చిత్రాన్ని నిలబెట్టారని, ఆ పాత్ర సినిమాకే హైలైట్ అయిందని, ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కూడా అతను ఒక హీరో అని ట్వీట్ చేశారు.