ప్రముఖ సినీ నటి మనోరమ (78) నిన్న రాత్రి కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయారు.
ఆమె 1958లో మలైట్టా మంగై అనే తమిళ సినిమాతో సినీ పరిశ్రమలో ప్రవేశించారు. ఆమె చివరిగా 2013లో రిలీజ్ అయిన సింగం-2 సినిమాలో నటించారు. అత్యధిక సినిమాలు చేసిన నటిగా ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకొన్నారు.
ఆమె తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ బాషలలో సుమారు 1200 పైగా సినిమాలలో, 1, 000కి పైగా నాటకాలలో, అనేక టీవీ సీరియల్స్ లో నటించారు. తెలుగులో శుభోదయం, రిక్షావోడు, బావ నచ్చాడు, నిన్ను చూడక నేనుండలేను, కృష్ణార్జునులు, అరుందతి సినిమాలలో నటించారు. ఆమె కొన్ని తమిళ సినిమాలలో పాటలు కూడా పాడారు.
ఆమె 1989లో విడుదలయిన పుదియ పాతై అనే తమిళ సినిమాలో ఆమె అద్భుత నటనకు జాతీయ అవార్డు అందుకొన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చి ప్రతిష్టాత్మకమయిన కలైమమణి అవార్డు, 1995లో ఫిలిం ఫేర్ లైఫ్ టైం అవార్డు, 2002లో పద్మశ్రీ అవార్డు అందుకొన్నారు. ఇవి కాక అనేక పురస్కారాలు అందుకొన్నారు.
మనోరమ అసలు పేరు గోపిశాంత. ఆమె 1937, మే26న తంజావూరు జిల్లాలో మనార్ గుడి లో జన్మించారు. సినీ రంగంలో ప్రవేశించక మునుపు ఆమె మంచి రంగస్థల నటిగా గురింపు తెచ్చుకొన్నారు. ఆమె నాటకాలు వేసే రోజుల్లోనే తన డ్రామా ట్రూప్ మేనేజర్ యస్. ఎం. రామనాధన్ తో ప్రేమలో పడి 1964లో ఆయనని వివాహం చేసుకొన్నారు. వారికి భూపతి అనే కుమారుడు కలిగాడు. కానీ పెళ్ళయిన రెండేళ్లకే వారి మధ్య విభేదాలు తలెత్తడంతో వారి విడిపోయారు. భూపతి కూడా ప్రస్తుతం తమిళ సినిమాలలో నటిస్తున్నారు.
మనోరమ మరణానికి తెలుగు, తమిళ, మళయాళ సినీ పరిశ్రమకు చెందిన పలు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆమెకు అంత్యక్రియలు నిర్వహిస్తారు.