మనుషులందరికీ ఒక్కో రకమయిన అభిరుచి ఉన్నట్లే, రాజకీయ నాయకులలో కూడా ఒక్కో నాయకుడికి ఒక్కో ఫేవరేట్ సబ్జెక్ట్ ఉంటుంది. లక్ష్మీ పార్వతికి, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుని విమర్శించడం ఫేవరేట్ సబ్జక్ట్ అయితే, చంద్రబాబు నాయుడుకి రాజధాని నిర్మాణం ఫేవరేట్ సబ్జక్ట్. అలాగే వైకాపా ఎమ్మెల్యే రోజాకి పవన్ కళ్యాణ్ న్ని విమర్శించడం ఫేవరేట్ సబ్జక్ట్. అందుకే ఆమె తనకు దొరికిన ప్రతీ అవకాశంలో పవన్ కళ్యాణ్ నామస్మరణ చేస్తుంటారు.
ఈరోజు జగన్ దీక్షా వేదిక నుంచి మాట్లాడిన ఆమె అలవాటు ప్రకారం పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకొని తింటున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆమె ప్రశ్నించారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పెద్దమనిషి ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఎందుకు ప్రశ్నించడం లేదని రోజా ప్రశ్నించారు. ఆనాడు ఎన్నికల ప్రచార సమయంలో వాళ్లిదరూ హామీలు గుప్పిస్తుంటే అందుకు సాక్షిగా నిలబడి వారి తరపున ప్రచారం చేసి ప్రజల చేత ఓట్లు వేయించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్లిదరినీ ఎందుకు నిలదీసి అడగడం లేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకంగా పోరాడలేకపోయినా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షకు మద్దతు పలకాలని రోజా కోరారు.
రోజా ఆవిధంగా అడగడంలో తప్పులేదు. కానీ జగన్ కంటే చాలా ముందే నటుడు శివాజీ ప్రత్యేక హోదా కోసం పోరాటం మొదలుపెట్టి, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిలాగే నిరవధిక నిరాహార దీక్ష చేసారు. అప్పుడు ఆయన కూడా రోజాలాగే అన్ని పార్టీలని తన పోరాటానికి మద్దతు ఇమ్మని ప్రాధేయపడ్డారు. అప్పుడు జగన్ ఆయనకి మద్దతు ఇవ్వలేదు? అప్పుడు శివాజీకి మద్దతు ఇవ్వకపోయినా వైకాపా నేతలు ఎవరూ ఏమీ అనలేదు కానీ ఇప్పుడు జగన్ దీక్షకి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వకపోయినట్లయితే అది బాధ్యతారాహిత్యంగా వారికి కనిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం జగన్ దీక్ష చేస్తేనే దానికి అందరూ మద్దతు ఇవ్వాలి కానీ వేరెవరు చేసినా ఆయన మద్దతు ఈయరు. దానిని బట్టి ప్రత్యేక హోదాపై జగన్ కి ఎంత చిత్తశుద్ది ఉందో అర్ధం అవుతోంది. జగన్ లో చిత్తశుద్ది లోపించడమే కాదు ఆ క్రెడిట్ మొత్తం తనకి మాత్రమే దక్కాలనే స్వార్ధం కూడా కనబడుతోంది. అందుకే ఆనాడు శివాజీ పోరాటానికి జగన్ మద్దతు ఇవ్వలేదని భావించాల్సి ఉంటుంది. కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ మద్దతు ఆశించడం కూడా తప్పే.