హైదరాబాద్: నందమూరి కళ్యాణరామ్ తదుపరి చిత్రం ‘షేర్’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఆడియో గత శనివారం జూనియర్ ఎన్‌టీఆర్ చేతులమీదుగా విడుదలయింది. ఈ సందర్భంగా విడుదల చేసిన షేర్ ట్రైలర్‌లో తెలుగుదేశం ప్రభుత్వంపై ఒక సెటైర్ డైలాగ్ ఉండటం సంచలనం సృష్టిస్తోంది. నందమూరి అభిమానుల్లో ఇది పెద్ద చర్చనీయాంశమయింది.
సెటైర్ డైలాగ్ వివరాలు ఇలా ఉన్నాయి. ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ ఫేమ్ పృథ్వీ ఒక డైలాగ్ చెబుతారు. “పోలవరం ప్రాజెక్ట్, వీడి పెళ్ళి జరిగినట్టే ఉంటాయి, కానీ జరగవు చిరాగ్గా”. ఈ డైలాగ్ నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నివిమర్శించినట్లే ఉంది. పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం జోరుగా ఆరోపణలు, ప్రత్యారోపణలు నడుస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్, వైసీపీ వంటి ప్రతిపక్షాలతోపాటు, మిత్రపక్షం బీజేపీ కూడా ఇప్పటికే తీవ్ర విమర్శలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ పనులను పక్కనపెట్టిందని, బిల్లులుమాత్రం పెట్టి కేంద్రంనుంచి నిధులు రాబట్టుకుంటోందని బీజేపీ నేతలు ఇటీవల ఆరోపణలుకూడా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశానికే చెందిన, అందునా నందమూరి వంశానికి చెందిన కుటుంబంనుంచి వచ్చే ‘షేర్’ సినిమాలో పోలవరంపై వ్యంగ్యాస్త్రం ఉండటం సంచలనమే. మరి ఈ డైలాగ్ కావాలనే పెట్టారో, అవగాహనలేక పెట్టారో తెలియటంలేదు. అవగాహన లేక పెట్టి ఉంటే మాత్రం ఎవరైనా అప్రమత్తం చేస్తే విడుదలనాటికైనా తీసేస్తారు. విడుదలైన చిత్రంలో ఈ డైలాగ్ ఉందంటే కావాలనే పెట్టినట్లు అర్థం చేసుకోవచ్చు.