హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని నిలిపేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ శనివారం ఇచ్చిన స్టేను ఆ రాష్ట్ర ప్రభుత్వం లైట్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న ప్రాంతం ఎంతో సారవంతమైనదని, అందులో అనేక పంటలు పండుతున్నాయని, పైగా అది వరదలు సంభవించే ప్రాంతమంటూ పండలనేని శ్రీమన్నారాయణ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయగా, సుప్రీం కోర్టు కేసును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు పంపింది. ఈ పిల్‌పైనే ట్రిబ్యునల్ శనివారం స్టే విధిస్తూ, భూమి చదును పనులను నిలిపేయాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లభించిన తర్వాతే పనులు చేపట్టాలని సూచించింది. అయితే గుంటూరుజిల్లా ఉద్దండరాయపాలెంలో శంకుస్థాపన పనులు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. అటు ట్రిబ్యునల్ స్టేను వెకేట్ చేయించటానికి లీగల్‌గా ప్రయత్నాలుకూడా జరగకపోవటం ఆశ్యర్యం కలిగిస్తోంది.
గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రతి లాంఛనంగా అందుకునేసమయానికి పనులను పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. పనులు వేగవంతం చేయటంకోసం అధికారులు మరిన్ని యంత్రాలను తెప్పించి పనులు చేయిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవటానికి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సభా కార్యక్రమ వేదిక, పందిరి, స్వాగత ద్వారాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్టే గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించగా, ఒకటి రెండురోజులలో పర్యారణ అనుమతులు వచ్చేస్తాయని, దానిని గురించి పట్టించుకోవద్దని ఆయన చెప్పినట్లు సమాచారం.
మరోవైపు తమకు నోటీస్ ఇవ్వకుండానే పొలాలను చదును చేసేస్తున్నారని వెంకటపాలెం గ్రామ రైతులు ఆందోళన చేస్తున్నారు. వేదిక దగ్గరకు ఒక తాత్కాలిక మార్గాన్ని నిర్మించటంకోసం తమ గ్రామంలోని 20 ఎకరాలలో ఉన్న అరటితోటలను, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్‌లను శనివారం రాత్రి ఉన్నట్లుండి నాశనం చేశారని ఆరోపించారు. మరో మూడు రోజులుంటే తాము పంటను కోసేసేవాళ్ళమని చెప్పారు. ఒక్కో రైతుకు రు.2 నుంచి రు.3 లక్షలదాకా నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే అమరావతి శంకుస్థాపనలో హిందూమత సంప్రదాయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని హైకోర్ట్‌లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. క్రైస్తవ, ముస్లిమ్ మత సంప్రదాయాలనుకూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించాలని ఆ పిల్లో కోరారు. దానికి హైకోర్ట్ సానుకూలంగా స్పందిస్తూ ఆ మేరకు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.